సమీక్ష : బ్రోచేవారెవరురా – అలరించే కామెడీ థ్రిల్లర్ !

సమీక్ష : బ్రోచేవారెవరురా – అలరించే కామెడీ థ్రిల్లర్ !

Published on Jun 29, 2019 3:03 AM IST
Brochevarevarura movie review

విడుదల తేదీ : జూన్ 28, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25 /5

నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ‌
నిర్మాత : విజ‌య్ కుమార్ మ‌న్యం
సంగీతం : వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్‌
ఎడిటర్ :  రవితేజ గిరిజాల‌

శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బ్రోచేవారెవరురా’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

శ్రీవిష్ణు ( రాహుల్ ) ప్రియదర్షి (రాకీ) రాహుల్ రామకృష్ణ (ర్యాంబో) ముగ్గురు మంచి ఫ్రెండ్స్.. అయితే అప్పటికే ఇంటర్ మూడు సార్లు ఫెయిల్ అయి.. ఇంకా చదువుతూనే ఆకతాయి కుర్రాళ్లుగా కాలం గడుపుతుంటారు. ఈ క్రమంలో వాళ్ళు చదివే కాలేజీలోకే నివేదా థామస్ (మిత్ర) కూడా జాయిన్ అవుతుంది. అదే కాలేజీ ప్రిన్సిపల్ అయిన తన తండ్రితో తనకున్న సమస్యల కారణంగా నివేదా థామస్, శ్రీవిష్ణు గ్యాంగ్ తో స్నేహం చేస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. నివేదా తన తండ్రి నుండి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుటుంది. ఆ క్రమంలో శ్రీవిష్ణు బ్యాచ్, ఆమెకు ఎలా సాయం చేశారు ? ఆ సాయం కారణంగా వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు ? ఆ సమస్యల నుండి వాళ్లు బయటపడే క్రమంలో ఏ తప్పు చేశారు ? ఆ తప్పు వల్ల సత్యదేవ్ (విశాల్) లైఫ్ ఎలా టర్న్ అయింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన నివేదా థామస్ తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమాలో కిడ్నాప్ సన్నివేశాలు.. అదేవిధంగా మంచి చేయబోయిన ముగ్గురు ఆకతాయి కుర్రాళ్ళు అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి.

ఆ సన్నివేశాల్లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చాలా బాగా నటించారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. ఇక మరో ప్లాట్ లో హీరోగా నటించిన సత్యదేవ్ కూడా అద్భుతమైన నటనతో చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. ముఖ్యంగా నివేత పేతురాజ్ – సత్యదేవ్ మధ్య వచ్చే సాంగ్.. అలాగే వారి జర్నీ ఆకట్టుకుంటుంది.

ఇక ఎప్పటిలాగే ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్‌ తో బాగా నవ్వించారు. బ్యాగ్ కోసం ఏడ్చే చిన్న పిల్ల పాత్రను కూడా కథకు టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాల బాగా తీసుకున్నాడు. ఇక కూతురు మీద ప్రేమ ఉన్నా.. వ్యక్తపరచలేని తండ్రి పాత్రలో నటించిన నటుడు కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. నివేదా థామస్ అండ్ ఆమె తండ్రి మధ్య చివర్లో కలిగే ఎమోషనల్ కంటెంట్ కూడా సినిమాకే హైలెట్ నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

అదే విధంగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో (అక్కడక్కడా బాగా నవ్వించినా) ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. ఇక నివేదా థామస్ – ఆమె తండ్రి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ క్లైమాక్స్ కే పరిమితం చేసి సింఫుల్ గా ముగించారు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని కామెడీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగా తెరకెక్కించారు. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆయన అందించిన సత్య – నివేత పేతురాజ్ మధ్య వచ్చే పాట కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సాయి శ్రీరామ్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. రవితేజ గిరజాల ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత విజయ్ కుమార్ మాన్యం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సరదాగా సాగుతూ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో వచ్చే ఛేజింగ్ సీన్స్ స్లోగా సాగుతాయి. ఐతే శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్, సత్యదేవ్ అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ నటనతో సినిమాలో బాగా అలరించారు. ఈ సినిమాని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు