
‘బ్రూస్ లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున నిర్మితమవుతోన్న సినిమా. తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిన నేపథ్యంలో భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అక్టోబర్ 16న దసరా సీజన్‌కు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో బ్రూస్‌లీ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
ఇక ఇప్పటికే టీజర్స్, పోస్టర్స్ ద్వారా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, నిన్న విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. రామ్ చరణ్ మ్యాన్లీ లుక్స్, స్టైలిష్ ఫైట్స్ ఈ ట్రైలర్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ నేపథ్యం కూడా ఉంటుంది. బ్రూస్ లీ కూడా అదే కోవలో అన్ని అంశాలనూ మేళవించుకున్న సినిమాగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్న రామ్ చరణ్ చేసే ఫైట్స్ ఏ రేంజ్‌లో ఉండనున్నాయనే విషయాన్ని ట్రైలర్ రుచి చూపించింది.
ఇక శ్రీనువైట్ల సినిమాల్లో ఓ హైలైట్‌గా కనిపించే బ్రహ్మానందం ఈ సినిమాలో సుజుకీ సుబ్రమణ్యం అనే మరో నవ్వించే పాత్రతో సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో థమన్ మ్యూజిక్, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే పండగ సీజన్‌కు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలనూ నింపుకున్న సినిమాగా ‘బ్రూస్ లీ’ మెప్పించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

