మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు సాలిడ్ హైప్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నాడు.
పెద్ది జర్నీ గురించి చెప్పండి?
నా తొలి చిత్రం ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నాను. సాధారణంగా ఇంత టైమ్ పట్టదు, కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ గారు నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లగా, నేను చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చింది. ‘ఉప్పెన’ తర్వాత చరణ్ గారిని కలవడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేశాక దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తి చేసేశాం.
ఈ చిత్రం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
క్రికెట్ అందరికీ తెలిసిన ఆట కాబట్టి, మేము కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఇందుకోసం ‘దంగల్’ చిత్ర ట్రైనర్‌తో పాటు తెలంగాణ పహల్వాన్లను రంగంలోకి దించి ఆర్టిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం దాదాపు 3 నుండి 4 నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.
శివరాజ్ కుమార్ గారు, జగపతిబాబు గారు, దివ్యేందు శర్మ పాత్రల గురించి?
ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారు. శివన్న గారు ఒక గురువుగా, ఆటను బ్రతికించే వ్యక్తిగా కనిపిస్తారు. ఇక జగపతిబాబు గారు చేసిన అప్పలసూరి పాత్ర చాలా బరువైనది, హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే క్యారెక్టర్ అది. అలాగే దివ్యేందు పాత్ర కూడా సినిమాలో చాలా క్రేజీగా ఉంటుంది.
జాన్వీ కపూర్ పాత్ర గురించి?
జాన్వీ కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.
ఏఆర్ రెహమాన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
నాకు చిన్నప్పటి నుండి రెహమాన్ గారి ‘రోజా’, ‘బొంబాయి’ ఆల్బమ్స్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలని ఎప్పటినుంచో కల కన్నాను, ఈ సినిమాతో నా ఆ కల నెరవేరింది. ఆయన కంపోజ్ చేసిన పాటలను మన పక్కనే కూర్చొని స్వయంగా పాడుతుంటే వినడం ఒక అద్భుతమైన అనుభూతి, దాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆయన వర్కింగ్ స్టైల్ చూశాక.. లైఫ్ లాంగ్ ఆయనతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.
చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి?
పెద్ది’ సినిమాలో హీరో జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు ఆయన లుక్ ఎలా ఉండాలో ముందే ఏఐ (AI) ద్వారా డిజైన్ చేసి చరణ్ గారికి చూపించాను. అయితే, నేను ఏఐలో డిజైన్ చేసిన దానికంటే కూడా ఆయన రియల్‌గా ఇంకా అద్భుతంగా మారిపోయారు. స్క్రీన్‌పై ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మైండ్బ్లోయింగ్గా అనిపిస్తుంది.
నిర్మాత సతీష్ గారి గురించి?
నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే నాకు సతీష్ గారు తెలుసు. చరణ్ గారు కూడా ఆయనతో సినిమా చేద్దామని చెప్పారు. సతీష్ గారు సినిమాపై చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈరోజుకీ ఫోన్ చేసి “తిన్నావా?” అని ఆప్యాయంగా అడుగుతుంటారు. అలాంటి మంచి వ్యక్తిత్వమున్న ప్రొడ్యూసర్‌తో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.
పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?
ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. కథలో మంచి ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ముఖ్యంగా థియేటర్లో మీకు ఎక్కడా రామ్ చరణ్ గారు కనిపించరు… కేవలం ‘పెద్ది’ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. పెద్ది తను ఆడే ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతని జీవితానికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుంది.


