ఈ క్రిస్మస్ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస సినిమాలు సందడి చేయనున్నాయి. ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా, పతంగ్, వృషభ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన వృషభ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మొదట రోషన్ మేకా ను ఎంపిక చేసినప్పటికీ, షెడ్యూల్ సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
తీవ్ర పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాకు గీతా ఆర్ట్స్ మద్దతివ్వడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బన్నీ వాస్ స్పందిస్తూ, “వృషభ డబ్బింగ్ సినిమా కాదు. సెన్సార్ బోర్డు నుంచి ఇది నేరుగా తెలుగు సర్టిఫికెట్ పొందింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ ఉన్న సినిమా కావడంతో విడుదల తేదీని మార్చడం సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు.
“నిజానికి వృషభ రెండు నెలల కిందటే విడుదల కావాల్సింది. ఆ సమయంలో థియేటర్లు ఖాళీగా ఉండేవి. కానీ సీజీఐ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ 25కి వాయిదా పడింది. మేము ఇచ్చిన కమిట్‌మెంట్‌ను గౌరవించాల్సిందే. హిందీలో ఈ సినిమాను పెన్ మూవీస్ విడుదల చేస్తోంది. వాళ్లతో మాకు మంచి సంబంధాలున్నాయి. అందుకే మా మాటను నిలబెట్టుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదు” అని తెలిపారు.


