లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. అయితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆమె తన పద్ధతిని మార్చుకుని రెండు ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినప్పటికీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు ఆమె రాలేదు. దీంతో త్వరలో జరగనున్న ‘మెగా సక్సెస్ సెలబ్రేషన్స్’ కైనా ఆమె హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల సరసన నటించేందుకు గ్లామర్, నటన పరంగా నయనతారే ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆమె తన పారితోషికాన్ని ఏకంగా రూ.15 కోట్లకు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో గత పదేళ్లుగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా రికార్డు సృష్టించిన నయన్ కోసం, నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం నయనతార వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన నాలుగోసారి నటిస్తున్నారు. కేవలం షూటింగ్లకే పరిమితమయ్యే నయన్, ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో కూడా కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


