పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, హరీష్ శంకర్ పవన్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై కూడా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సుమారు ఐదేళ్ల క్రితం ప్రకటించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ లెక్కన మార్చి నెల పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పాలి. ఒకవైపు ‘ఉస్తాద్’ థియేటర్లలో సందడి చేస్తుండగానే, మరోవైపు కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుండటంతో బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ జాతర మొదలైనట్టే కనిపిస్తోంది.


