చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస పరాజయాల తర్వాత 2026లో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ ఏడాది ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ కమర్షియల్ హిట్‌గా నిలవగా, ‘బైకర్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాల్లో శర్వానంద్ పడ్డ కష్టం, ఆయన మేకోవర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ హీరో సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే మాస్ ఎంటర్‌టైనర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్లతో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ నుండి మైత్రి మూవీ మేకర్స్ తప్పుకోవడంతో, అనిల్ సుంకరకి చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ భాగస్వామిగా రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి శర్వానంద్ కో-ప్రొడ్యూస్ చేస్తూ స్వయంగా సమర్పిస్తున్నాడట.
ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తక్కువ వర్కింగ్ డేస్‌తో, శరవేగంగా షూటింగ్ షెడ్యూళ్లను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.


