సమీక్ష : ‘కెప్టెన్‌ మార్వెల్‌’ : తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది !

సమీక్ష : ‘కెప్టెన్‌ మార్వెల్‌’ : తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది !

Published on Mar 7, 2019 11:40 PM IST
Captain Marvel movie review

విడుదల తేదీ : మార్చి 07, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్, బెన్ మెండెల్సోన్, జూడ్ లా, అన్నెట్టింగ్ బెనింగ్

దర్శకత్వం : అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్

నిర్మాత : విక్టోరియా అలోన్సో

సంగీతం : పినార్ టోప్రక్

సినిమాటోగ్రఫర్ : బెన్ డేవిస్

ఎడిటర్ : డెబ్బీ బెర్మన్, ఎలియట్ గ్రహం

మార్వెల్‌ సంస్థ నుండి తాజాగా వస్తోన్న చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ‘బ్రీ లార్సన్‌’ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్‌ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ముందుగానే ప్రెస్ కి ప్రీమియర్ షో వేయటం జరిగింది. కాగా రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ డబ్బింగ్ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కరోల్ డాన్వర్స్ (బ్రీ లార్సన్) ఒక లేడీ పైలట్. సూపర్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తుంటుంది, కాగా కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా గుర్తుకు వచ్చే తన గతం తాలూకు జ్ఞాపకాలతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా .. అది ఆమె వల్ల కాదు. అయితే ఆమె కొన్ని విపరీతమైన శక్తులను కలిగి ఉంటుంది, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో ఆమెకు తెలియదు.
ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆమెకు యాదృచ్ఛికంగా తన గతం గురించి తెలుస్తోంది. అలాగే కొన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో ఆమెకు ఎవరు మంచి ? ఎవరు చెడు ? అని తెలుస్తోంది. మరి మంచి వాళ్ల కోసం ఆమె ఏం చేసింది ? ఆమెకున్న పవర్ ను సరైన విధంగా ఎలా ఉపయోగించింది ? ఆ క్రమంలో ఆమె విజయం సాధించిందా ? విజయం సాధించిండానికి ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆస్కార్‌ అవార్డు గ్రహీత బ్రీ లార్సన్‌ ఈ చిత్రంలో సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె ఆ పాత్రలో ఇన్ వాల్వ్ అయిన విధానం, ఈ సినిమా కోసం ఆమె చూపించిన అంకితభావం గురించి మరియు నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వేగంగా వెళుతున్న రైలు పై లార్సన్‌ పోరాడిన సన్నివేశాలు అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ‌ఆ సన్నివేశాల కోసం లార్సన్‌ చేసిన కఠినమైన కసరత్తులు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి.

సినిమాలో లార్సన్‌ ఫ్రెండ్ గా నటించిన నటి కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కీలకమైన పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె పలికించిన హావభావాలు ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక లార్సన్‌ కు కమాండర్ గా నటించిన నటుడు కూడా విలన్ పాత్రలో తన నటనతో మెప్పిస్తారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.

ఇక సూపర్‌ పవర్ చిత్రాలంటే యాక్షన్‌కు కొదవ ఉండదు. అందుకు తగినట్లుగానే భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దారు దర్శకులు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆయా సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ను చాలా చక్కగా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకులు ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్ ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించినా… ఆ తర్వాత సినిమాను అంతే ఆసక్తికరంగా నడపలేదు. సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ ను అయితే పుట్టించారు గానీ.. ఆ ఇంట్రస్ట్ ను చివరి వరకు మెయింటైన్ చెయ్యలేకపోయారు. ముఖ్యంగా దర్శకులు కథలోని మెయిన్ పాయింట్ కి సంబంధించిన సీన్స్ కంటే కూడా అనవసరమైన యాక్షన్ సన్నివేశాలతోనే సినిమాని నింపేశారు.

దీనికి తోడు కథ కూడా పాత కాలం నాటి యాక్షన్ కథలా సాగుతుంది. పైగా అవసరం లేని పోరాట సన్నివేశాలు అనవసరమైన సందర్భాల్లో రావడంతో.. సినిమాకి బలహీనతగా నిలుస్తోంది. పైగా కొన్ని సన్నివేశాలు కమర్షియల్‌ సినిమాకు తగ్గని రీతిలో ఉంటాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకులు ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్ ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించారు. అయితే వారు రాసిన స్క్రీన్ ప్లే పూర్తి ఇంట్రస్ట్ గా సాగకపోయిన సినిమా మెప్పిస్తోంది.

సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగా అక్కట్టుకున్నేలా ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

ఆస్కార్‌ అవార్డు గ్రహీత బ్రీ లార్సన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా.. ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్‌ దర్శకత్వంలో.. మార్వెల్‌ సంస్థ నుండి రానున్న ఈ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ డబ్బింగ్ చిత్రం కొన్ని సన్నివేశాలు మినహా.. సినిమా ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. సూపర్‌ పవర్ సినిమాలంటే అమితంగా ఇష్ట వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా సినిమా మాత్రం సూపర్‌ పవర్ యాక్షన్‌ సన్నివేశాలతో, భారీ యాక్షన్‌ యాక్షన్ సీన్స్ తో మరియు విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో అద్భుతంగా అనిపిస్తోంది. అయితే, తెలుగు నేటివిటీకి ఈ సినిమా.. చాలా దూరంగా సాగుతుంది. మరి తెలుగు సినిమాలు ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ చిత్రం ఎంతగా ఎక్కుతుందో చూడాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు