కౌటిల్య, యాషిక హీరో హీరోయిన్ లుగా, సూర్య దర్శకత్వంలో జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చైతన్యం. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ, ఎవరో వస్తారు ఎదో చేస్తారని బద్దకంతో అచేతనంగా బతికితే మనిషిని, సమాజాన్ని, దేశాన్ని అది ఎప్పటికి ఎదగనీయదు, కానీ అందరిలా తాను అలా కాకూడదు అనుకున్న ఓ యువకుడు గొప్పగా బ్రతకాలని కలలు కని దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు, అయితే అతని జీవితంలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది అని అన్నారు. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేసామని అన్నారు. కౌటిల్య, యాషిక తమ తమ పాత్రల్లో చక్కగా చేసారని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో చిత్రాన్ని క్వాలిటీతో నిర్మించామని అన్నారు. తప్పకుండా ఇది అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అని అన్నారు.
నిర్మాతలు మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, చాలా మంచి కథ ఇది, పథకాల పేరుతొ ప్రజలను కొందరు ఎలా చేతకానివాళ్ళలా మారుస్తున్నారు, దానివల్ల ప్రజలు ఎలా తయారవుతున్నారు అన్న పాయింట్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని అన్నారు. చైతన్యం కలవాడు ముందడుగు వేస్తే ఎలా ఉంటుంది అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన కథ ఇది అంటూ చెప్పుకొచ్చారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు. అయితే ఈ చిత్రంలో కౌటిల్య, యాషిక, సుందరం రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి, రామారావు, శివప్రసాద్, విష్ణుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అర్జున్ రాము అందించారు.


