టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల పర్సెంటేజ్ విధానంపై నెలకొన్న తీవ్ర వివాదం చివరకు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల వాదనలను పూర్తిగా విన్న మెగాస్టార్.. ఈ వివాదం ఏదో ఒక సినిమాకో లేదా ఒక సెక్టార్‌కో పరిమితం అయింది కాదని.. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పద్ధతులు ఉండాలని స్పష్టం చేశారు. టాలీవుడ్‌లో హయ్యెస్ట్ బాడీ అయిన ‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన గట్టిగా గుర్తుచేశారు.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వెళ్లి ఇండస్ట్రీ పరువు తీయవద్దంటూ చిరంజీవి గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఛాంబర్ ఒకసారి అందరినీ సంప్రదించి పర్సెంటేజ్ మోడల్‌పై కమిటీని ఏర్పాటు చేశాక.. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరూ మీడియా ముందు సొంత అభిప్రాయాలు వ్యక్తపరచకూడదని హితవు పలికారు. ఇలాంటి పనుల వల్ల పరిశ్రమలో ఐక్యత లేదనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేసిన కమిటీల పనితీరు వల్ల సింగిల్ స్క్రీన్ సభ్యుల్లో కొంత అసంతృప్తి, అపనమ్మకం ఉన్న మాట నిజమేనని అంగీకరించిన చిరు.. ఈసారి ఛాంబర్ వేసిన కమిటీ జూన్ 30వ తేదీ గడువు లోగా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తుందని, దానికి తన వంతు పూర్తి ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు.
మెగాస్టార్ ఇచ్చిన ఈ బంపర్ అస్యూరెన్స్‌తో సింగిల్ స్క్రీన్స్ ప్రతినిధులు మరియు ఇండస్ట్రీ పెద్దలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తమ అసోసియేషన్లలోని మిగతా సభ్యులతో చర్చించి 24 గంటల్లోగా తమ ఆమోదాన్ని తెలియజేస్తామని చిరంజీవికి వారు మాట ఇచ్చారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ హై-ప్రొఫైల్ సమావేశంలో TFCC ప్రెసిడెంట్ సురేష్ బాబు, అల్లు అరవింద్, TFDC చైర్మన్ దిల్ రాజుతో పాటు ప్రముఖ నిర్మాతలు కె.ఎల్. నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్ మరియు సుదర్శన్ థియేటర్ ప్రొప్రయిటర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


