టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఒక టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాలని గత కొంతకాలంగా ఆలోచిస్తున్న చిరంజీవి, ఎట్టకేలకు ఈ డీల్‌ను ఓకే చేసినట్లు సమాచారం. ఈ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనకు భారీగా రెమ్యూనరేషన్ అందనుందని టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిమానులకు మెగాస్టార్‌ను మరింత చేరువ చేసే దిశగా ఇది ఒక చారిత్రాత్మక పరిణామంగా నిలవనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
మరోవైపు వరుస ప్రతిష్టాత్మక చిత్రాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘కాకా’ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన గ్రాండ్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ చిరంజీవి పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం.


