‘The Odyssey’ Premiere Reports : నోలన్ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఇండియన్ స్క్రీన్స్ పై హాలీవుడ్ విజువల్ వండర్ ?

‘The Odyssey’ Premiere Reports : నోలన్ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఇండియన్ స్క్రీన్స్ పై హాలీవుడ్ విజువల్ వండర్ ?

Published on Jul 16, 2026 11:58 AM IST

హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒక సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓపెన్‌హైమర్’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సరికొత్త విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ జూలై 17న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే భారత్‌లో ఈ సినిమా సందడి మొదలైంది. యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ తమ గ్లోబల్ ప్రీమియర్ టూర్‌లో లండన్, ప్యారిస్, న్యూయార్క్ నగరాల సరసన ముంబైని కూడా అధికారిక స్టాప్‌గా చేర్చింది. జూలై 10, 11 తేదీల్లో ముంబైలో జరిగిన ఈ గ్రాండ్ ప్రీమియర్ షోలకు మరియు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అనూహ్య స్పందన లభించింది.

ఈ చారిత్రాత్మక ఈవెంట్ కోసం దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఆయన భార్య అలాగే సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎమ్మా థామస్‌తో కలిసి ముంబై వచ్చారు. వారితో పాటు మార్వెల్ స్టార్ టామ్ హాలెండ్, వర్సటైల్ యాక్టర్ మాట్ డామన్ కూడా ఇండియాలో ల్యాండ్ అయి సందడి చేశారు. గతంలో ‘ది డార్క్ నైట్ రైజెస్’, ‘టెనెట్’ సినిమాల షూటింగ్ కోసం భారత్‌కు వచ్చిన నోలన్, ఇక్కడ ఒక సినిమా ప్రీమియర్ లాంచ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

ఐమాక్స్ స్క్రీన్స్ పై విజువల్స్ పీక్స్.. ప్రేక్షకుల ఫస్ట్ రియాక్షన్స్ ఇవే!

హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీకు పురాణ ఇతిహాసం ఆధారంగా పూర్తి ఐమాక్స్ కెమెరాలతో ఈ చిత్రాన్ని నోలన్ తెరకెక్కించారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత హీరో ఒడిస్సియస్ (మాట్ డామన్) తన స్వస్థలమైన ఇథాకాకు చేరుకోవడానికి చేసే ప్రమాదకరమైన ప్రయాణమే ఈ సినిమా కథ. ముంబైలో జరిగిన మొదటి రోజు స్క్రీనింగ్‌లో ఇండియన్ మీడియా ప్రతినిధులు, కొందరు సెలబ్రిటీలు ఈ సినిమాను వీక్షించారు. సినిమా చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ఇదొక మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్ అని, ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్స్ పై వచ్చే గ్రాండియర్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలాని ఈ ప్రీమియర్ షో చూశాక స్పందిస్తూ.. “సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇందులో నోలన్ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ కూడా జోడించారు. ఇదొక గ్రాండ్ ఎపిక్. మాట్ డామన్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ నటన అద్భుతంగా ఉంది” అంటూ కొనియాడారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నోలన్ టేకింగ్, విజువల్స్, లీడ్ కాస్ట్ నటనను ఆకాశానికెత్తుతున్నారు.

ఇండియన్ ఆడియన్స్ పై హాలీవుడ్ స్టార్స్ ప్రశంసల వర్షం

ముంబై ప్రెస్ కాన్ఫరెన్స్ మరియు ప్రీమియర్ స్టేజ్ పై నోలన్, టామ్ హాలెండ్, మాట్ డామన్ లు ఇండియన్ ఆడియన్స్ చూపించిన లవ్ అండ్ ఎనర్జీకి ఫిదా అయిపోయారు. నోలన్ మాట్లాడుతూ.. “భారతీయ ప్రేక్షకులు సినిమాను ఎంతగానో ప్రేమిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహవంతులైన, సినిమా పరిజ్ఞానం ఉన్న ఆడియన్స్ ఇక్కడే ఉన్నారు. అందుకే నా సినిమాను ముంబైలో లాంచ్ చేయడం, మీతో కలిసి చూడటం చాలా త్రిల్లింగ్ గా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు మాట్ డామన్ స్పందిస్తూ.. “మేము అంతకుముందు మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ఒక స్క్రీనింగ్ వేశాం. కానీ, ఒక రియల్ పబ్లిక్ ఆడియన్స్ ముందు నిలబడి సినిమా చూపించడం ఇదే మొదటిసారి. మీకు సినిమా నచ్చడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని అన్నారు. ఇక టామ్ హాలెండ్ అయితే ఇండియన్ ఆడియన్స్ ఇచ్చే థియేట్రికల్ ఎనర్జీ మరెక్కడా ఉండదని, ఈ సినిమాకు సీక్వెల్ రావాలని తాను కోరుకుంటున్నట్లు క్రేజీ కామెంట్స్ చేశారు.

భారతదేశంలో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 52 నిమిషాల నిడివి గల ఈ హాలీవుడ్ ఎపిక్ యాక్షన్ డ్రామా జూలై 17న థియేటర్లలోకి వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ముంబై ప్రీమియర్ టాక్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు