సమీక్ష : ‘దర్పణం’ – నిరుత్సాహ పరిచే క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ !

Published on Sep 7, 2019 3:01 am IST

విడుదల తేదీ : సెప్టెంబరు 06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  1.5/5

నటీనటులు : తనిష్క్‌ రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగి పంత్‌ త‌దిత‌రులు.

దర్శకత్వం : రామకృష్ణ వెంప

నిర్మాత‌లు : క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి. ప్ర‌వీణ్‌కుమార్ యాద‌వ్‌,

సంగీతం : సిద్దార్ధ్ స‌దాశివుని

సినిమాటోగ్రఫర్ : స‌తీష్‌ ముత్యాల‌

తనిష్క్‌ రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగి పంత్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకం పై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఈ సినిమా కథలోకి వెళ్తే.. కార్తీక్ (తనిష్క్‌ రెడ్డి) అల్లరిచిల్లరగా తిరుగుతూ తన ఫ్రెండ్స్ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కార్తీక్ బ్యాచ్ ఓ బంగ్లాలోకి దొంగతనానికి వెళ్తారు. కానీ అప్పటికే ఆ బంగ్లాలోని శ్రావ్య (శుభంగి పంత్‌) కుంటుంబాన్ని ఎవరో చంపేసి వెళ్తారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కార్తీక్, మధుమతి (ఎలక్సియస్‌)తో ప్రేమలో పడతాడు. అయితే శ్రావ్య దెయ్యంగా మారి వీళ్ళను భయపెడుతూ.. తన బంగ్లాలో బంధిస్తోంది. మరి దెయ్యం నుండి కార్తీక్ బ్యాచ్ ఎలా తప్పించుకుంది ? ఇంతకీ శ్రావ్య కుంటుంబాన్ని చంపింది ఎవరు ? అలాగే శ్రావ్యని చంపింది ఎవరు ? అసలు శ్రావ్యకి మధుమతి ఉన్న సంబంధం ఏమిటి ? అదేవిధంగా కార్తీక్, మధుమతి ప్రేమకు వచ్చిన సమస్య ఏమిటి ? చివరికి వాళ్లిద్దరూ ఒక్కటవుతారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన తనిష్క్‌ రెడ్డి తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా తనిష్క్‌ రెడ్డి నటన బాగుంది. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి.

ఇక హీరోయిన్ గా నటించిన ఎలక్సియస్‌, నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన శుభంగి పంత్‌ కొన్ని హర్రర్ సీన్స్ లో అవలీలగా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన నటీనటులతో పాటు హీరోకి ఫ్రెండ్స్ గా నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎంచుకున్న కంటెంట్ లో సస్పెన్స్ హారర్ కి అలాగే ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ రాసుకునే అవకాశం ఉన్నా దర్శకుడు మాత్రం పేలవమైన స్క్రిప్ట్ తోనే సినిమాని తెరకెక్కించాడు. అలాగే కథాకథనాల్లో కూడా సరైన ప్లోను మెయింటైన్ చేయలేకపోయాడు. అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. పైగా భయపెట్టే అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి.. చాలా టైమ్‌ వేస్ట్‌ చేసారు. సినిమాలో చాలా భాగం రొటీన్‌ హారర్ తంతుగానే సాగుతుంది.

అయితే సినిమాలో కొన్ని హారర్ ఎలెమెంట్స్ ను ఉన్నా.. కథ కథనంలో పట్టు లేకపోవడంతో అవి కూడా పూర్తిగా తేలిపోయాయి. ముఖ్యంగా పేలని కామెడీ అండ్ హార్రర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. దానికి తోడు ఆ సన్నివేశాలు అన్ని.. ఒకేలా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. క్లైమాక్స్ ను కూడా ఒక హారర్ ఎఫెక్ట్ తో చిన్న ఫైట్ పెట్టి మమ అనిపించేసారు. దర్శకుడు ఉన్న కంటెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొడుతోంది. దర్శకుడు రామకృష్ణ వెంప స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు సిద్దార్ధ్ స‌దాశివుని అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా హారర్ ఎఫెక్ట్ సీన్స్ ను చాల బాగా ఎడిట్ చేశారు. అయితే సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. స‌తీష్‌ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి. ప్ర‌వీణ్‌కుమార్ యాద‌వ్‌ పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు :

తనిష్క్‌ రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగి పంత్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌’ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాలు బాగాలేకపోవడం, సినిమాలో సరైన ప్లో లేకపోవడం, మరియు రొటీన్‌ హారర్ తంతు వ్యవహారంతో విసిగించే విధంగా సాగడం, ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తంగా ఈ సినిమా నిరాశ పరుస్తోంది.

123telugu.com Rating :  1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More