‘శుభం’ సినిమాతో విజయాన్ని అందుకున్న యంగ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “దీవాన”. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ద్వారా హీరోయిన్ స్నేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయమవుతున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా.. హీరో హర్షిత్ రెడ్డి ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ పంచుకున్నాడు.
– మా నాన్నగారిది మిర్యాలగూడ అయినా నేను పెరిగింది హైదరాబాద్‌లోనే. మొదట యూట్యూబ్, ఇన్‌స్టా వీడియోస్ చేసేవాడిని. వాటిని చూసి వైజయంతీ మూవీస్ వారు ‘మెయిల్’ సినిమాకు ఆన్‌లైన్ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేశారు. అందులో నా ‘బీకామ్ కంప్యూటర్స్’ డైలాగ్ నచ్చి, రాజ్ అండ్ డీకే నన్ను ‘శుభం’ సినిమాకు ఎంపిక చేశారు. ఇక ‘కల్కి’ సినిమాలోనైతే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఆడిషన్ లేకుండానే నన్ను తీసుకున్నారు. ‘చూడగానే పాపం అనిపించే మొహం కావాలి, నువ్వు అలా ఉన్నావు’ అని ఆయన చెప్పారు. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడే ఈ అవకాశాలు వచ్చాయి. సినిమాలతో పాటు రెండు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాను.
– ‘శుభం’ కంటే ముందే నాకు ‘దీవాన’ ఆఫర్ వచ్చింది. నిర్మాతలు వాసు గారు, శ్రీదేవి గారు స్క్రిప్ట్ నచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. సినిమా పూర్తయ్యాక అవుట్‌పుట్ చూసి, అల్లు అరవింద్ గారు గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయడానికి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేము పక్కాగా వర్క్‌షాప్స్ చేశాం. మూడు రోజులు షూటింగ్ చేస్తే, పది రోజులు వర్క్‌షాప్స్ ఉండేవి. అందుకే కొంచెం టైమ్ తీసుకున్నాం కానీ ఎక్కడా రీ-షూట్స్ చేయలేదు. ప్రతి సీన్‌ను సెట్స్‌లోనే ఇంప్రువైజ్ చేస్తూ ముందుకు వెళ్లాం. సినిమా మొత్తాన్ని రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే క్రౌడ్ అంతా కూడా షూటింగ్ చూడటానికి వచ్చిన రియల్ జనమే.
– ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మున్నా. ఇది పక్కా ఓల్డ్ సిటీ అబ్బాయి వైబ్ ఉన్న పాత్ర. దీనికోసం ఆడిషన్స్‌కు వచ్చిన హైదరాబాదీ కుర్రాళ్లను అబ్జర్వ్ చేశా. నేను కూడా మలక్‌పేట, కొత్తపేటల్లో తిరిగినవాడినే కావడం, మా డైరెక్టర్ సికింద్రాబాద్ వ్యక్తి కావడం బాగా ప్లస్ అయింది. ఇప్పటివరకు నేను సాఫ్ట్ రోల్స్ చేయడంతో, ఈ భిన్నమైన పాత్రలోకి మారడానికి కొంచెం టైమ్ పట్టింది. నా క్యారెక్టర్ ‘రంగీలా’లో ఆమిర్ ఖాన్‌లా ఉండాలని డైరెక్టర్ చెప్పారు. షూటింగ్‌లో ‘అవున్రా చిల్లరగాన్నేరా’ అనే డైలాగ్ సీన్ చేసిన తర్వాత నుంచే నాకు మున్నా క్యారెక్టర్ మీటర్ పట్టుబడింది. అక్కడి నుంచి ఆ బాడీ లాంగ్వేజ్‌ను డెవలప్ చేసుకుంటూ నటించాను.
– మున్నా క్యారెక్టర్‌లో ‘అర్జున్ రెడ్డి’ వైబ్స్ ఉన్నాయని కొందరు అన్నారు. సినిమాలో మేము ‘నా పిల్లరా’ అనే డైలాగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ పోలిక మొదలైంది. అయితే హైదరాబాద్‌లో కుర్రాళ్లు సాధారణంగానే అలా మాట్లాడుతుంటారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఆ మాడ్యులేషన్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయింది అంతే. ఇక సినిమాలో అమ్మాయి నాకు హింట్ ఇచ్చిందా, సతాయించిందా లేక వద్దన్నదా అనేది మాత్రం మీరు థియేటర్లలోనే చూడాలి.
– ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన ఓ కుర్రాడి కథే ‘దీవాన’. ఇందులో ఎవరూ ఊహించని ఒక సరికొత్త పాయింట్, ఎమోషన్ ఉంటాయి. ముఖ్యంగా ఆ పాయింట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది; అందుకే టీజర్, ట్రైలర్లలో కూడా దాన్ని రివీల్ చేయలేదు. మన రియల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకసారి ఇలా ‘దీవాన’ అవుతాం. నిజానికి మా డైరెక్టర్ కూడా ప్రేమలో ఒక దీవాననే.
– మా సినిమా అల్లు అరవింద్ గారికి విపరీతంగా నచ్చింది. ఆయన నన్ను పిలిచి కొన్ని సీన్స్‌లో నా నటనను ప్రశంసించడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చిరంజీవి, విజయ్ దేవరకొండ, నాని, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలు చూస్తూ పెరిగాను. బహుశా ఆ ప్రభావం నాపై ఉందేమో. అయితే ‘దీవాన’ చూస్తున్నప్పుడు మీకు ‘అర్జున్ రెడ్డి’ అస్సలు గుర్తుకురాదు. ఆ పాత్రలోని హైదరాబాద్ నేటివిటీ, అగ్రెషన్ వల్లే కొందరికి ఆ పోలిక అనిపించి ఉండవచ్చు. ఇందులో సీన్స్ అన్నీ నా పర్సనల్ టచ్‌తో చాలా లైవ్లీగా చేశాను. నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా నటించిన వాళ్లతో కలిపి, ఇదంతా హైదరాబాద్, ఓల్డ్ సిటీ కుర్రాళ్లంతా కలిసి చేసిన ఒక జెన్యూన్ సినిమా.
– ‘మెయిల్’ సినిమా తర్వాత నాకు వస్తున్న ప్రతి అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ప్రతి ప్రాజెక్ట్ కోసం నా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి నటిస్తున్నా. ప్రస్తుతం ‘కల్కి 2’ చిత్రంలోనూ నటిస్తున్నాను; అలాగే ‘రోమియో జూలియట్’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాను.


