‘పుష్ప’కు డిఎస్పీ ఏం ఫీడ్ బ్యాక్ ఇచ్చారో చూడండి

Published on May 8, 2021 3:00 am IST

‘రంగస్థలం’ విజయం తరవాత సుకుమార్ తన పరిధిని విస్తరించారు. పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలనే లక్ష్యంతో ‘పుష్ప’ను మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కూడ తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే ఈ సినిమానే కరెక్ట్ అని భావించి ఓకే చెప్పేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలైతే సుకుమార్ అడిగినంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఒక్క కోవిడ్ ఇబ్బందులు మినహా మిగతాదంతా సుకుమార్ అనుకున్నట్టే జరుగుతోంది. సుకుమార్ ఎప్పుటిలాగే ఈ చిత్రానికి బాణీలు కట్టే బాధ్యతను దేవిశ్రీప్రసాద్ చేతిలో పెట్టారు. సుకుమార్, డిఎస్పీ కాంబినేషన్ ఎలాంటిదో అందరికీ తెలుసు.

సుకుమార్ చేసిన ప్రతి సినిమాకు దేవిశ్రీప్రసాదే సంగీతం అందిస్తుంటారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆల్బమ్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అందుకే ‘పుష్ప’ బాధ్యతలు కూడ డిఎస్పీ చేతిలోనే పెట్టారు సుకుమార్. ఈ సినిమా గురించి దేవిశ్రీ మాట్లాడుతూ సుకుమార్ విజన్ ఏ స్థాయిలో ఉందో బయటపెట్టారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే సుకుమార్ ‘పుష్ప’ విషయంలో మరింత జాగ్రత్తగా ఉన్నారని, సినిమా స్థాయి వేరేలా ఉంటుందని అన్నారు. ఈ సినిమాతో సుకుమార్ కథ చెప్పే విధానం ఇంకా గొప్పగా మారుతుందని, సినిమా పూర్తిస్థాయి మాడ్ ఎంటర్టైనర్ అని అన్నారు. ఇక బన్నీ అయితే పాత్ర కోసం తనను తాను మలుచుకుంటున్నారని అన్నారు. దేవి మాటల్ని బట్టి సినిమా అందరూ అనుకున్నదానికంటే విశేషంగా ఉంటుందని అనిపిస్తొంది.

సంబంధిత సమాచారం :