కింగ్ అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ మూవీపై అన్నపూర్ణ స్టూడియోస్ గతంలో ఓ ప్రకటన చేసింది. అయితే, ఇప్పటివరకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి కారణం నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేయడమే అని తెలుస్తోంది. రా కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్ అండ్ మనీ హీస్ట్ థ్రిల్లర్‌గా ఈ వందో చిత్రం రూపొందుతోంది.
ఈ ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ‘జైలర్ 2’, ‘విశ్వంభర’, ‘స్వయంభు’ వంటి ఎన్నో భారీ పాన్-ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉండడంతో.. వాటితో పోటీ పడటం కంటే నేరుగా సంక్రాంతి పండగ సీజన్‌లో రావడమే బెటర్ అని నాగ్ భావిస్తున్నాడట. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత నాగార్జున సరసన టబు నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చిత్రాన్ని ప్రస్తుతానికి నాగ్ పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ రా కార్తీక్ ఈ పీరియాడిక్ కథను, నాగార్జున విభిన్న షేడ్స్ లుక్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో నాగ్ లుక్ కోసం ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారట. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


