చేరువైన దూరమైన ట్రైలర్ ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

చేరువైన దూరమైన ట్రైలర్ ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

Published on Aug 15, 2021 10:00 AM IST

anil

సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ హీరో హీరోయిన్ లుగా వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన దూరమైన. సుకుమార్ పమ్మి సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఎంతో ఆప్తమిత్రుడు, ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు అని అన్నారు. తన స్ట్రగుల్స్ లో తోడుగా వున్నారని, తన స్టోరీస్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు అని వ్యాఖ్యానించారు. 2008 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నామని, అందుకే ఆయన మేనల్లుడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చానని అన్నారు. సుజిత్ కి మంచి భవిష్యత్ వుందని, ఇంకా చాలా దూరం ప్రయాణించాలని అన్నారు. తప్పకుండా ఈ చిత్రం హిట్ అవుతుందని, చిత్ర యూనిట్ కి మంచి భవిష్యత్ వుంటుందని, ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకొని ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం అని తెలిపారు.

చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ, ప్రతి సంక్రాంతికి పండుగ చూస్తాం, ఆ పండుగ రోజు అనిల్ రావిపూడి గారి సినిమా చూస్తాం, సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి గారు, ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ కావడం సంతోషంగా వుంది అంటూ చెప్పుకొచ్చారు. ఓ ఏడాది నుంచి ఈ చిత్రం థియేటర్ కి దూరమవుతూ వచ్చింది, చివరకు ఈ ఆగస్టు 20కి చేరువవుతోంది, ఈ ఏడాదిలో చాలా టెన్షన్ పడ్డా అంటూ చెప్పుకొచ్చారు. చాలా మంది నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేయండి, ఫస్ట్ సేవ్ అవ్వండి అని చెప్పేవారు, కానీ డైరెక్టర్ గా సినిమాను థియేటర్లోనే చూడాలనుకున్నాను అని అన్నారు. ఈ విషయాన్ని నిర్మాతలకు చెప్పలేను, అలాగని ఓటీటీకి వెళ్లమని చెప్పలేను, అయితే నిర్మాతల నోటి నుంచే విన్నమాట, ఈ సినిమాను థియేటర్లోనే చూద్దాం అని అన్నారు. చాలా మంది ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది అని, చాలా మంది జీవితాలు ఆధారపడి వున్నాయి అని, థియేటర్లోనే సినిమాను రిలీజ్ చేద్దాం అని ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు రియల్ హీరోస్ నిర్మాతలిద్దరూ అని అన్నారు. కథను నమ్మి, ఎంతో ప్యాషన్ తో సినిమాను తీశారని, థియేటర్లో తన సినిమాను చూడటం కల అని, ఆ కల నెరవేరబోతోంది అని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే హీరో సుజిత్ కు కూడా థియేటర్లో విడుదల కావడం ఎంతో ముఖ్యమని, హీరో సుజిత్ తో తనకు చాలా అనుబంధం వుందని అన్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఓ మూడు నిమిషాల నిడివిగల ఓ డెమో సన్నివేషాన్ని తీసి సుజిత్ వాళ్ల అమ్మకు చూపించామని, ఆమె ఎంతో ఆనందించారు, తనను నమ్మి వాళ్ల అబ్బాయిని తన చేతిలో పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. సుజిత్ లో ఆనందం కంటే, వాళ్ల అమ్మ కళ్లలో ఆనందమే చూడాలనుకున్నా అని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరించామని, సుజిత్ ఎంతో కష్టపడి చేశారని, ఆయన కెరీర్ కి ఈ చిత్రం ఎంతో ఉపయోగపడతుందని అన్నారు. హీరోయిన్ కూడా చాలా బాగా నటించారని, మొదట్లో కొంత ఇబ్బంది పడినా, ఆ తరువాత బాగా సహకరించి సినిమా సకాలంలో పూర్తి కావడానికి తోడ్పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఓ సీన్ వుంటుంది, హీరోనో చెంపదెబ్బ కొట్టాలి హీరోయిన్, అయితే ఈ సీన్ ను చేయను అని హీరోయిన్ చెప్పేసింది, దాంతో చాలా టెన్షన్ పడ్డా, ఎందుకంటే తర్వాత ఓ ముద్దు సీను తీయాలి, మరి చెంపదెబ్బ కొట్టడానికే ఒప్పుకోలేదు, ముద్దు సీనుకు ఒప్పుకుంటుందా, అనే సందేహంతో హీరోయిన్ ను అడిగితే, తాను వెంటనే ఓకే చెప్పేశారు అంటూ చెప్పుకొచ్చారు. మరి చెంపదెబ్బకు, ముద్దు సీనుకు తేడా ఏంటో హీరోయిన్ తరుణిసింగ్ చెప్పాలి అని అన్నారు. క్లైమాక్స్ సీనును ఎంతో కష్టపడి చేసిందని, ఆమె సహకరించకపోతే క్లైమాక్స్ సీను అంతబాగా వచ్చేది కాదు అని అన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ మంచి పేరు తెస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ తరుణి సింగ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఝతలు, తన మీద ఎంతో నమ్మకం వుంచి ఈ సినిమాను తీశారని, హీరో సుజిత్ చాలా సపోర్టివ్ గా వుంటారు, చాలా క్యూట్ గాయ్, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తోంది, థియేటర్లో ఈ సినిమాను చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అన్నారు.

హీరో సుజిత్ మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నా, ఏనాడూ తన తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. ఈ రోజు ఈ సినిమా కంప్లీట్ చేయడం వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనే అనుకుంటున్నా అని, కొత్త హీరో నైనా కూడా నిర్మాతలు నమ్మి కోట్లు ఖర్చు పెట్టి, ఈ సినిమాను తీశారని, వారికి ఎంతో రుణపడి వున్నా అని అన్నారు. దర్శకుడితో ఉన్న అనుబంధం లాంగ్ జర్నీ అని, తన మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ సినిమాను తీశారు అని, తనతో నెక్ట్స్ సినిమా కూడా తీస్తా అన్నారని, చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ మంచి సంగీతం అందించారు, తరుణి సింగ్ చాలా సపోర్ట్ చేసి నటించారు, టామ్ అండ్ జెర్రీలాగా నటించి కంప్లీట్ చేశామని అన్నారు. శశి కూడా చాలా సపోర్ట్ గా ఉండి ప్రోత్సహించారు, క్లైమాక్స్ సీన్ పై చాలా సందిగ్ధం వుండేది, అయితే దాన్ని ఓ ఛాలెంజింగ్ గా తీసుకొని కంప్లీట్ చేశామని అన్నారు. అది తెరమీద చూసినప్పుడు మీరే చెబుతారు ఆశీర్వదించండి అని అన్నారు. ఈ చిత్రం టీజర్ ను గోపీచంద్ మలినేని లాంఛ్ చేసి ఆశీర్వదించారు, ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రైలర్ లాంఛ్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని అన్నారు. తను కమెడియన్ శ్రీనివాసరెడ్డి అల్లుడిని అని ఎప్పూడూ ఎక్కడా చెప్పలేదని, ఈ రోజు చెబుతున్నా, ఎందుకుంటే, తను నన్ను సొంతగా ఎదగాలని చెప్పారు, అందులో భాగంగానే ఎప్పూడ రివీల్ చేయలేదని, ఈ రోజు గర్వంగా ఆయన అల్లుడిని అని చెబుతున్నా అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు