మోహన్ బాబు తనయుడుగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, హీరోగానే కాక నిర్మాతగానూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు విష్ణు. తాజాగా ఆయన ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించిన దేవాకట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే! 2014లో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’ సినిమాకు రీమేకే ఈ ‘డైనమైట్’. విష్ణు తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డైనమైట్ సినిమాను నిర్మించారు.
ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విష్ణు తన కెరీర్లో మొదటిసారి ఓ కంప్లీట్ యాక్షన్ రోల్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ చూస్తే ఈ సినిమా మంచి సస్పెన్స్ ఎలిమెంట్‌తో నడిచే స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమాగా కనిపిస్తోంది. ఓ బలమైన అంశం చుట్టూ కథ నడుస్తుందని ట్రైలర్ ద్వారా దర్శకుడు ఓ హింట్ ఇచ్చేశారు. దేవాకట్టా ఎప్పట్లానే తన మార్క్ టేకింగ్‌ను ఈ సినిమాలోనూ చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఏ భయం నిజాన్ని దాచిపెడుతుందో.. అదే భయం నిజాన్ని కక్కిస్తుంది’ అంటూ దేవాకట్టా చెప్పించిన డైలాగ్ ఆయన స్టైల్‌ను గుర్తు చేస్తోంది.
యాక్షన్ రోల్‌లో విష్ణు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాటోగ్రఫీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయన్న విషయం ట్రైలర్ ద్వారా క్లియర్‌గా తెలిసిపోతోంది. ఓవరాల్‌గా రెండు నిమిషాల ట్రైలర్‌తోనే సినిమాపై మంచి ఆసక్తిని కల్పించడంలో విష్ణు, దేవాకట్టా సఫలమయ్యారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 24న విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
డైనమైట్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
