శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ ఆర్టిస్ట్ ఆదర్శ బాలకృష్ణ. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఆదర్శ్ త్వరలో రిలీజ్ కానున్న రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సందర్భంగా ఆదర్శ్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి గోవిందుడు అందరివాడేలే లో తన పాత్ర గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్, క్రికెట్ పై తనకున్న ఆసక్తి గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) మొదటగా మీకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది.?
స) సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ టైం నుంచి శ్రీ కాంత్ గారు నాకు బాగా క్లోజ్.. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీ కాంత్ గారు కీ రోల్ చేస్తున్నారు అని నాకు తెలిసినప్పుడు ఆ సినిమాలు నాకు కూడా ఏమన్నా పాత్ర దొరుకుతుందేమో అని ఎంక్వైరీ చేసాను. శ్రీ కాంత్ గారే నా పేరుని కృష్ణవంశీ గారికి సజెస్ట్ చేసారు. ఆ తర్వాత కృష్ణవంశీ గారే రామ్ చరణ్ పక్కన నెగటివ్ రోల్ నేను చేయగలనని నిర్ణయం తీసుకొని అవకాశం ఇచ్చారు.
ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’ లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) బాగా రిచ్ కుటుంబంలో పుట్టిన కాస్త చెడు తోవలో వెళ్తున్న కుర్రాడి పాత్ర చేసాను. బాగా అహంకారం ఉన్న కుర్రాడు, గ్రామంలో నేనే గొప్ప వాడిని, ఉన్నతమైన వాడిని అనుకునే పాత్ర ఇందులో చేసాను. రావు రమేష్ మరియు కోట శ్రీనివాస్ రావు మెయిన్ విలన్స్ గా కనిపిస్తారు. రావు రమేష్ గారికి అబ్బాయిగా, కోట గారికి మనవడిగా కనిపిస్తాను.
ప్రశ్న) కృష్ణవంశీ గారితో పనిచేయడం ఎలా ఉంది.?
స) ఓహ్ సూపర్.. చెప్పాలంటే నాకు మళ్ళీ స్కూల్ కి వెళ్లినట్టు ఉంది. షూటింగ్ టైంలో వంశీ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు షూటింగ్ లేని సమయంలో కూడా సెట్ కి రమ్మని మిగతా నటీనటులు ఎలా చేస్తున్నారనే విషయాన్ని బాగా గమనించమనేవారు. యాక్టింగ్ ప్రకారం ఆయన చాలా టఫ్ మాస్టర్ మరియు ఆయన నుంచి ఒక కాంప్లిమెంట్ తీసుకోవడం చాలా కష్టమైన పని.
ప్రశ్న) ఇప్పటివరకూ మీరు నగేష్ కుకునోర్, రామ్ గోపాల్ వర్మ, శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసారు, ఇప్పుడు కృష్ణ వంశీ. మరి వీరందరితో పని చేసిన అనుభవం ఎలా ఉంది.?
స) వీరందరితో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ ఫిల్మ్ స్కూల్ కి చెందిన వారు. ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను.
ప్రశ్న) ఈ సినిమాపై మీకున్న అంచనాలు ఏమిటి.?
స) ఈ సినిమాపై నాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రొడక్షన్ బ్యానర్ నుంచి స్టార్స్ వరకూ అందరూ స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్ళే.. అలాగే ఈ సినిమా నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను.
ప్రశ్న) ఈ సినిమా తర్వాత ఫ్యూచర్ లో అన్నీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే వస్తాయని ఏమన్నా వర్రీ అవుతున్నారా.?
స) నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. నా వారకూ ప్రేక్షకులు నేను చేసిన ఈ రోల్స్ ని ఇష్టపడ్డారు అంటే నెగటివ్ రోల్స్ చెయ్యడంలో ఎలాంటి వర్రీ లేదు. నెగటివ్ షేడ్స్ లో నాకంటూ ఓ ప్రత్యేకతని ఏర్పరుచుకోవడానికి ట్రై చేస్తాను.
ప్రశ్న) ఇప్పుడు కాస్త వెనక్కి వెళితే.. అసలు మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు.?
స) నేనెప్పుడూ ఒక క్రికెటర్ కావాలనుకునేవాన్ని, అందుకే క్రికెట్ లో బాగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. నాగేష్ కుకునోర్ ఎప్పుడైతే తన సినిమాలో రియల్ గా క్రికెట్ లో మంచి స్కిల్స్ ఉన్న ఓ కుర్రాడు తన సినిమాకి కావాలనుకున్నాడో, అప్పుడు నన్ను సెలక్ట్ చేసుకున్నారు, ఆ సినిమాలో నా రోల్ చేసి వచ్చేసాను. హ్యాపీ డేస్ లో కూడా లానే జరిగింది. నేను నా ఫ్రెండ్ తో కలిసి హ్యాపీ డేస్ ఆడిషన్స్ కి వెళితే అనుకోకుండానే సెలెక్ట్ అయిపోయాను.
ప్రశ్న) తెలుగు వారియర్స్ క్రికెట్ టీం లో మీరే మెయిన్ లీడ్ ప్లేయర్ గా ఉన్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది.?
స) చెప్పాలంటే క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది.. ఆ క్రికెట్ వల్లే ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను. తెలుగు వారియర్స్ టీంలో నేనొక కీ మెంబర్ అవ్వడం అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ కూడా నా డ్రీం అయిన క్రికెట్ లో ఉన్నాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతానికయితే నా ఫోకస్ అంతా గోవిందుడు అందరివాడేలే మీదనే ఉంది. ఇది కాకుండా సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమా నెక్స్ట్ లైన్ లో ఉంది. ఆ సినిమాలో కూడా నా పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది.
ప్రశ్న) చివరిగా ‘గోవిందుడు అందరివాడేలే’ గురించి మా పాఠకులకి ఏం చెప్తారు.?
స) గోవిందుడు అందరివాడేలే పరిపూర్ణమైన కుటుంబకథా చిత్రం. అన్ని రకాలు మిమ్మల్ని చివరి వరకూ ఎంటర్టైన్ చేస్తుంది.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ఆదర్శ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము..


