‘అరుంధతి’ అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. అనుష్కకు జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా కనిపిస్తారు. కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో బందిపోటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. అల్లు అర్జున్ సరసన అనామికా దేవి పాత్రలో కేథరిన్ నటించింది.
ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. శబ్దాలయా రికార్డింగ్ థియేటర్ లో సినిమాలో నటించిన జూనియర్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ మొదలై వారం రోజులు కావొస్తుంది. ప్రధాన తారాగణం డబ్బింగ్ ప్రారంభించడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఇండియాలో ఫస్ట్ స్టీరియో స్కోపిక్ 3డి సినిమాగా రూపొందుతున్న ‘రుద్రమదేవి’ని తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


