ఫిల్మ్‌ఫేర్ అవార్డు విషయంలో అభిమానుల రగడ!

Samantha-Sruthi-hassan
దాదాపుగా ఇండియన్ సినిమా మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానం తర్వాత సాధారణంగానే తమ ఫేవరైట్ హీరో/హీరోయిన్‌కు అవార్డు వస్తుందని ఆశపడి, అది రాకపోతే బాధపడే అభిమానులను చూస్తూనే ఉంటాం. తాజాగా 2014కు సంబంధించి నిన్న సాయంత్రం నిర్వహించిన అవార్డుల విషయంలో ఈసారి అభిమానులు కొంచెం ఎక్కువగానే స్పందించారు. నిన్న జరిగిన అవార్డు వేడుకలో తెలుగు సినిమాకు గానూ ఉత్తమ నటి క్యాటగిరీలో శృతీ హాసన్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ‘రేసు గుర్రం’ సినిమాకు గానూ ఆమె ఈ అవార్డును అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. అదే సంవత్సరంలో విడుదలైన ‘మనం’ సినిమాలోని నటనకు సమంత ఉత్తమ నటి క్యాటగిరీలో నామినేషన్లలో ఒకరుగా ఉండగా, అవార్డు మాత్రం శృతి హాసన్‌ను వరించింది. ఇక తమ అభిమాన నటికి అవార్డు రాలేదన్న బాధలో సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై విమర్శలు గుప్పించారు. అవార్డు ప్రకటించినప్పట్నుంచే ఆన్‌లైన్లో ఈ కాంపెయిన్ నడుస్తోంది. ఇక ఏ అవార్డైనా ఆ సంస్థ పరిధులు, నిర్వాహకులు, జడ్జిల అభిప్రాయాల మేరకే నిర్ణయించబడతాయన్న విషయంలో సందేహం లేదు. జ్యూరి అభిప్రాయాల మేరకే అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. ఇందులో వివాదాలను లేవనెత్తడమనేది అనవసర చర్య అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Exit mobile version