గణేష్ నిజంగానే స్వాతిముత్యమే.. ఈ చిత్రం అందరికీ వినోదాన్ని పంచుతుంది – నాగవంశీ

గణేష్ నిజంగానే స్వాతిముత్యమే.. ఈ చిత్రం అందరికీ వినోదాన్ని పంచుతుంది – నాగవంశీ

Published on Oct 3, 2022 9:00 AM IST

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యువ సంచలనం నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు), బెల్లంకొండ శ్రీనివాస్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సినిమా. ఇంతమంది ముందు మాట్లాడటం కూడా ఇదే మొదటిసారి. సినిమా చాలా బాగా వచ్చింది. స్వాతిముత్యం చిత్రం రావడానికి మొదటి కారణం గణేష్. నేను చెప్పిన కథ విని, ఇది నేను తీయగలనని నమ్మిన గణేష్ కి ధన్యవాదాలు. నా సినిమాలో భాగమైనందుకు వర్షకి ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. నా స్క్రిప్టే త్రివిక్రమ్ గారు చదివి, చాలా బాగా రాశావని ప్రశంసించారు. నేను ఎవరి స్పూర్తితో సినీ పరిశ్రమకు వచ్చానో, ఆయన నా స్క్రిప్ట్ చదివి నాకు భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” చినబాబు గారు, వంశీ గారు కొత్త వారికి అవకాశం ఇవ్వడం వారి గొప్పతనం. దర్శకుడు లక్ష్మణ్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనకు చాలా స్పష్టత ఉంది. ఆయన చాలా పెద్ద దర్శకుడు అవుతాడని ఆశిస్తున్నాను. గణేష్ గురించి చెప్పాలి. ‘గణేష్ నవ్వు చాలు.. ఫుల్ అవుతుంది సినిమా హాలు’. ట్రైలర్ లో ఒక డైలాగ్ చెప్పాను ‘క్యారెక్టర్ లో మావాడు స్వాతిముత్యం అని’. నిజంగానే గణేష్ స్వాతిముత్యమే. గణేష్ బాగా నటించాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన నవీన్ పొలిశెట్టి, సిద్దు,బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అక్టోబర్ 5న విడుదలవుతున్న మా చిత్రాన్ని చూసి అందరూ ఆశీర్వదించండి” అన్నారు.

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇదే శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలకు పాస్ లు దొరక్క తిరిగి వెళ్లిపోయిన రోజులున్నాయి. అలాంటి నన్ను ఈరోజు ఈ వేదిక మీద అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాతిముత్యం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న బెల్లంకొండ గణేష్ కి స్వాగతం. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. గణేష్ కి, వర్షకి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సితార బ్యానర్ లో నాగవంశీ గారితో వచ్చే ఏడాది ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వస్తున్నాను. నాగవంశీ గారు జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత. రాధాకృష్ణ గారు స్థాపించిన ఈ సంస్థను వంశీ గారు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. నచ్చేలా తీస్తే చిన్న సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాలను అందిస్తారు. దానికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘డీజే టిల్లు’ వంటి సినిమాలు ఉదాహరణ. స్వాతిముత్యం కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “పిలవగానే ఈ వేడుకకు వచ్చి వినోదాన్ని పంచిన నవీన్ కి ధన్యవాదాలు. అక్టోబర్ 5న స్వాతిముత్యం సినిమా వస్తుంది. ఈ సినిమా అసలు నిరాశపరచదు. థియేటర్ కి వచ్చిన అందరికీ ఖచ్చితంగా వినోదాన్ని పంచుతుంది.” అన్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ” స్వాతి ముత్యంతో హీరోగా పరిచయమవుతున్న గణేష్, మిగతా టీమ్ కి ఆల్ ది బెస్ట్. గణేష్ కి మొదటి సినిమానే చినబాబాబు గారు, త్రివిక్రమ్ గారు, వంశీ గారి గైడెన్స్ లో సితారలో చేసే అవకాశం వచ్చింది. సితార నుంచి ఈ ఏడాది ఇప్పటికే వచ్చిన డీజే టిల్లు, బీమ్లా నాయక్ సినిమాలు ఘన విజయం సాధించాయి. స్వాతిముత్యం కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

గణేష్ మాట్లాడుతూ.. ” మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక మంచి కథ రావట్లేదు అనుకుంటున్న సమయంలో లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు అని నమ్మి ఈ కథ సితార వారు దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. సితార వారు కూడా ఇది మంచి సినిమా అవుతుందని నమ్మి, అన్నీ సమకూర్చి, ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు