సంగీత దిగ్గజం ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శకుడు, నిర్మాత ఆదిత్య హాసన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను లాంఛ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో, శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో, సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో రూపొందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు రామారావు మాట్లాడుతూ, ఘంటసాల గాయకుడిగా మాత్రమే కాక, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయాలనుకున్నట్లు తెలిపారు. సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, డిసెంబర్ 12న చిత్రాన్ని కచ్చితంగా రిలీజ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఘంటసాల పాత్ర పోషించిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఆయన జీవిత చరిత్రలో భాగమవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రివ్యూ చూసిన చాలా మంది భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. నటుడు సుమన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, అతులిత చిన్న ఘంటసాలగా నటించారు. ‘మహానటి’లా ఈ చిత్రం కూడా గొప్ప విజయం సాధిస్తుందని రామసత్య నారాయణరాజు అభిప్రాయపడ్డారు. ఘంటసాల స్వాతంత్ర్య సమరయోధుడు అనే అంశాన్ని శోభా రాణి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వాలు ఈ చిత్రానికి సహకరించాలని కోరారు.


