
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలకు దగ్గరవుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రభాస్, రానా, తమన్నా తదితరులు పలు ఎంటర్టైన్మెంట్ చానళ్ళలో సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఎఫ్.ఎం.రేడియో స్టేషన్లలోనూ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ప్రభాస్ ఇప్పటివరకూ రేడియో స్టేషన్లలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఇక యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాకు ప్రమోషన్ కూడా అదే రేంజ్లో ఉండాలని భావించిన రాజమౌళి, రెండు నెలల క్రిందటినుంచే ఆన్లైన్లో క్యాంపెయిన్లు నిర్వహిస్తూ సినిమాను ప్రేక్షకుడికి చేరువ చేశారు. తెలుగు, తమిళంలో ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండగా బాలీవుడ్‌లోనూ ఆ స్థాయి క్రేజ్ తెప్పించడం కోసం ‘బాహుబలి’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన బాహుబలి సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. హిందీలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే!

