మూవీ బ్రాట్స్ బ్యానర్‌పై రమేష్ జిల్లా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ టైం’. చాణక్య జిల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర వేడుకకు నటుడు నందు, దర్శకుడు శశికిరణ్ తిక్క, నిర్మాత వంశీ నందిపాటి ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నటుడు నందు మాట్లాడుతూ.. ‘గుడ్ టైం’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, చిన్న సినిమా అయినా బలమైన కథతో వస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. ప్రమోషన్లను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని చిత్ర బృందానికి సూచించారు.
హీరో నిఖిల్ గాజుల మాట్లాడుతూ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన తనను నమ్మి ప్రధాన పాత్రను అప్పగించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు చాణక్య జిల్లా వివరించారు. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్వాన్ ఆత్రేయ సంగీతం అందించగా, అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు.


