ఎట్టి పరిస్థితులలోను ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదల చేయాలని భావించడంతో సినిమాలో ‘కొక్కో కోడి..’ పాట మిస్ అయ్యింది. ఆల్బంలో ఉన్న ఏకైక మాస్ సాంగ్ ఇదే. ఆడియోలో ఆరు పాటలు ఉండగా, సినిమాలో ఐదే ఉన్నాయి. షూటింగ్ చేసే టైం లేకపోవడంతో ఆ పాట లేకుండానే సినిమాను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆ పాటను చిత్రీకరించే పనిలో ఉన్నారు మూవీ యూనిట్ సభ్యులు. షూటింగ్ ఉండడంతో రామ్ చరణ్ దసరా సెలవులు కూడా తీసుకోవడం లేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బ్రేక్ కూడా తీసుకోవడం లేదని తెలిపాడు. ‘గోవిందుడు..’ సెట్ లో దసరా సెలబ్రేట్ చేసుకోనున్నాడు. త్వరలో ఈ పాటను సినిమాలో జత చేయనున్నారు. ఈ పాట సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని హీరో, దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను మరోసారి ఆకర్షించడానికి ఈ మధ్య కాలంలో పాటను, సన్నివేశాలను జతచేయడం సర్వసాధారణం అయిపొయింది. రామ్ చరణ్ ‘మగధీర’లో కూడా విడుదల తర్వాత కొన్ని సన్నివేశాలను జత చేశారు.


