విడుదల తేదీ : అక్టోబర్ 09 , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : శోభినవ్ సత్య, విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు
దర్శకత్వం : డాక్టర్ విశాల్ చతుర్వేది
నిర్మాతలు : రాగిణి ఎస్, నమ్రత జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, విశాల్ చతుర్వేది
సంగీతం : సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయాస్ ధర్మాధికారి, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది
ఛాయాగ్రహణం : విశాల్ బావా
కూర్పు : శంఖ రాజ్యాధ్యక్ష
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రూ. 2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లతో హిందీ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిందీలో అద్భుత ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథాంశం :
ఈ కథ స్వాతంత్ర్యానికి పూర్వం జరుగుతుంది. డాక్టర్ రామ్ నందన్ భోంస్లే (చందన్ ఆనంద్) సైన్స్‌ను మాత్రమే నమ్ముతూ, దైవంపై ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి. అయితే, ఆయన జీవితంలో జరిగిన ఒక అనూహ్య సంఘటన ఆయన అపనమ్మకాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. ఆ క్రమంలోనే లక్ష్మీనారాయణ శర్మతో పరిచయం ఏర్పడుతుంది.
ఆ లక్ష్మీనారాయణ శర్మే కాలక్రమంలో ‘నీమ్ కరోలీ బాబా’గా (శోభినావ్ సత్య) ఎలా మారారు? ఆయన సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎందరి జీవితాలను స్పృశించారు? అనే విషయాలను డాక్టర్ భోంస్లే ఎలా గ్రహించారన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.
ప్లస్ పాయింట్స్ :
భక్తి, బయోపిక్ కథలకు బలమైన భావోద్వేగాలే ప్రాణం. ఆ విషయంలో ‘హనుమాన్ అంశ్’ మెప్పిస్తుంది. ప్రథమార్ధంలో పాత్రల పరిచయానికే ప్రాధాన్యమిచ్చినా, ద్వితీయార్థంలో ఎమోషన్స్ పుంజుకుని ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి.
ఎలాంటి రాజకీయ అజెండాలు, అనవసర ప్రచారాలు జోడించకుండా కేవలం బాబా వ్యక్తిత్వం, ఆయన నిస్వార్థ కరుణపైనే దృష్టి సారిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. టైటిల్ రోల్‌లో శోభినావ్ సత్య నటన హుందాగా, సహజంగా సాగింది. ఎక్కడా అతి నాటకీయత లేకుండా ఆయన చూపిన పరిపక్వత సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సినిమాలోని సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. రైలులో బ్రిటిష్ అధికారితో జరిగే సంభాషణ, పార్వతి ఇంట్లో భోజనం చేసే సన్నివేశం, ఇంటర్వెల్ ముందు అండర్‌గ్రౌండ్ టన్నెల్‌లో వచ్చే శివుని ప్రతిరూప దృశ్యం ప్రేక్షకులలో బలమైన ముద్ర వేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాటిక్ మెరుపులు, భారీ ట్విస్టులు, కమర్షియల్ హంగులను ఆశించి వెళ్లే ప్రేక్షకులకు ఈ చిత్రం కొంత నిరాశ కలిగించవచ్చు. ఇది వేగంగా సాగే కమర్షియల్ చిత్రం కాదు; నిదానంగా ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.
సినిమా పేసింగ్ నెమ్మదిగా సాగడం ప్రధాన లోపం. ప్రశాంతంగా సాగే కథనం వల్ల కొన్ని చోట్ల ఆసక్తి తగ్గుతుంది. అంతేకాకుండా, నీమ్ కరోలీ బాబా చరిత్రపై ముందే అవగాహన ఉన్నవారికి ఈ కథ మరింత బాగా కనెక్ట్ అవుతుంది. నేపథ్యం తెలియని సాధారణ ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా, పునరావృతమైనట్లుగా అనిపించే అవకాశం ఉంది.
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా ఈ చిత్రంలో మొదటి మార్కు సంగీత విభాగానికే పడుతుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని భావోద్వేగాలను చక్కగా ముందుకు నడిపించాయి. దర్శకుడు విశాల్ చతుర్వేది సంభాషణలు, సన్నివేశాలను నేలవిడిచి సాము చేయకుండా నిజాయితీగా తెరకెక్కించారు. నాటి కాలాన్ని ప్రతిబింబించేలా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.
ఎడిటింగ్ విషయంలో మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది; కొన్ని సన్నివేశాల నిడివిని తగ్గించే ఆస్కారం ఉంది. కథకు తగిన నిర్మాణ విలువలు కుదిరాయి. ఇక తెలుగు డబ్బింగ్ సహజంగా ఉండటంతో డబ్బింగ్ సినిమా అనే భావన కలగకుండా సాఫీగా సాగిపోతుంది.
తీర్పు :
మొత్తంగా చూస్తే, ‘హనుమాన్ అంశ్’ భావోద్వేగాలతో కూడిన నిజాయితీగల ఆధ్యాత్మిక చిత్రం. శోభినావ్ సత్య హుందాతనంతో కూడిన నటన, అద్భుతమైన నేపథ్య సంగీతం, ద్వితీయార్థంలో వచ్చే కీలక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. నెమ్మదిగా సాగే కథనం కొంత సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ, నీమ్ కరోలీ బాబా భక్తులకే కాకుండా ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడే సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని అందిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


