
వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన సినిమా ‘పడ్డానండి ప్రేమలో మరి’. మహేష్ ఉప్పుటూరి దర్శకుడు. పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కమర్షియల్ ఫార్మటులో తెరకెక్కిన ఈ లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా విజయం సాధిస్తుందని వరుణ్ సందేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. స్క్రీన్ ప్లే మెయిన్ హైలైట్ అవుతుందని వరుణ్ సందేశ్ చెప్పారు.
సినిమా విజయంపై నమ్మకంతో వరుణ్ సందేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. అమెరికాలో ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాను వరుణ్ సందేశ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గత కొంత కాలంగా విజయాలు లేకపోవడంతో వరుణ్ సందేశ్, సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు. తర్వాత నటిస్తున్న ‘లవకుశ’లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో ఆంధ్రా అబ్బాయిగా, మరొక పాత్రలో తెలంగాణ కుర్రాడిగా అలరిస్తానని చెప్పారు.