విడుదల తేదీ : నవంబర్ 27, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సుగి విజయ్, జుప్సీ భద్ర, ఆశ్రిత వేముగంటి, హారిక రాజేందర్, డాక్టర్ పృథ్వీరాజ్ తదితరులు
దర్శకత్వం : పరమేష్ రేణుకుంట్ల
నిర్మాతలు: దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి
సంగీతం : వరికుప్పల యాదగిరి
ఛాయాగ్రహణం : విజయ్ సీ కుమార్
కూర్పు : ఆవుల వెంకటేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
సుగి విజయ్, జుప్సీ భద్ర హీరోహీరోయిన్గా పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఐ హేట్ మ్యారేజ్’. ఎం.దయానంద్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
రామ్ (సుగి విజయ్)కి సినిమాలు అంటే పిచ్చి. సినిమానే తన ప్రాణం అన్నట్టు లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. తన తల్లికి సీరియస్ అయి, హాస్పిటల్ లో ఉన్నా.. సినిమా పై పిచ్చితో ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి వెళ్తాడు. ఇలాంటి ఎమోషనల్ లెస్ పర్సన్ లైఫ్ లోకి జాహ్నవి (జుప్సీ భద్ర) వస్తోంది. ఐతే, జాహ్నవికి పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్ తో తిరగాలని ఆశ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో జాహ్నవి – రామ్ ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది ?, చివరికి వారిద్దరూ ఒక్కటి అయ్యారా ? లేదా ?, వారి ప్రేమను జాహ్నవి తండ్రి ఒప్పుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన సుగి విజయ్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో, అలాగే హీరోయిన్ తో సాగే లవ్ సీన్స్ లో సుగి విజయ్ నటన పర్వాలేదు. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా సుగి విజయ్ ఎమోషనల్ గా బాగానే నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన జుప్సీ భద్ర నటన సినిమాకి ప్లస్ అయింది. ఆమె తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. తల్లి పాత్రలో ఆశ్రిత వేముగంటి చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ చాలా బాగుంది. పృథ్వీరాజ్ తో పాటు హారిక రాజేందర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా పాయింట్ లో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల అనవసరమైన సన్నివేశాలను ఇరికించాడు. సినిమాల పై పిచ్చితో బతికే హీరో పాత్రకి, మోడ్రన్ కల్చర్ ను ఇష్టపడే హీరోయిన్ పాత్రలకు మధ్య సీన్స్ ను ఇంకా చాలా బాగా రాసుకోవచ్చు. కానీ, ఉన్న సీన్స్ కూడా చాలా రెగ్యులర్ గా సాగాయి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ప్లే చాలా స్లోగా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల లవ్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నటీనటుల నటన బాగున్నా, వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు మాత్రం సినిమాని బలహీనపరిచింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి అందించిన సంగీతం పర్వాలేదు. ఇక ఎడిటర్ గా కూడా బాధ్యతలు చేపట్టిన ఆవుల వెంకటేష్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఫైనల్ గా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
తీర్పు:
‘ఐ హేట్ మ్యారేజ్’ అంటూ వచ్చిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో.. కొన్ని యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఐతే, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా రొటీన్ వ్యవహారాలతోనే ఊహాజనితంగా సాగుతుంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


