ఇంటర్వ్యూ : ఇలియానా – నాకు తెలుగులో రీఎంట్రీకి ఇదే సరైన సినిమా !

ఇంటర్వ్యూ : ఇలియానా – నాకు తెలుగులో రీఎంట్రీకి ఇదే సరైన సినిమా !

Published on Nov 11, 2018 6:52 PM IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. కాగా నవంబర్ 16న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఇలియానా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం ..

ఈ సినిమాకి మీరు సైన్ చెయ్యటానికి ఏ అంశాలు మిమ్మల్ని ఎక్కువుగా ఆకర్షించాయి ?

ఈ సినిమా చెయ్యటానికి గల కారణాలు అంటే.. ముందుగా పరిగణలోకి తీసుకోవాలసింది ఈ సినిమా స్క్రిప్ట్ మరియు స్క్రిప్ట్ లోని నా పాత్రనే. నా కెరీర్ లోనే నేను చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను మరియు చాలా అసాధారణమైన పాత్రను పోషిస్తున్నాను ఈ సినిమాలో. ఇప్పుడు నేను నా పాత్రను రివీల్ చెయ్యకూడదు. కానీ వన్ వర్డ్ లో చెప్పాలంటే.. నా కెరీర్ లోనే ఈ పాత్ర చాలా ప్రత్యేకమైనది అవుతుందని చెప్పగలను. ఇక అన్నిటికి మించి ఈ సినిమాలో హీరో రవితేజ. తనతో వర్క్ చెయ్యడం చాలా సరదాగా ఉంటుంది. రవితో నాకు ఇది నాలుగవ సినిమా.

చాలా గ్యాప్ తరువాత మీరు తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. దాని గురించి చెప్పండి ?

అవును. నిజంగానే చాలా గ్యాప్ వచ్చింది. కానీ అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదు. జులాయి సినిమా చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుండి బార్ఫీ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా చేశాను. ఆ తరువాత, తెలుగు నుండి కొన్ని ఆఫర్లు వచ్చాయి గాని, ఆ కథలు నచ్చకపోవడమో.. డేట్లు ఎడ్జెస్ట్ అవ్వకపోవడమో వంటి కారణాల వల్ల టాలీవుడ్ కి నాకు కొంత గ్యాప్ వచ్చింది. నేను అయితే టాలీవుడ్ కి దూరం అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే మంచి రోల్ కోసం ఎదురుచూశాను. మా దర్శకుడు శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ స్టోరీ చెప్పినప్పుడు నాకు కథ చాలా బాగా నచ్చింది. నాకు తెలుగులో రీఎంట్రీకి ఇదే సరైన సినిమా అని వెంటనే.. ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను.

ఒక దశాబ్దం కన్న పైగానే మీరు సినిమాల్లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఇలియానాకి సినిమాల పై దృక్పధం ఏమైనా మారిందా ?

నాకే కాదు, ఎవరికైనా ఖచ్చితంగా మారుతుంది. ‘దేవదాస్’ సినిమా చేస్తోన్న సమయంలో నేను ఇరవై ఏళ్ళ వయస్సులోనే ఉన్నాను. అప్పుడు నాకు సినిమా పై ఇంట్రస్ట్ తప్ప, అంతగా సినిమా పై అవగాహన లేదు. కానీ ఆ తరువాత సినిమాలు చేస్తూ వస్తోన్న క్రమంలో సహజంగానే సినిమాల పై కొంత అవగాహన పెరిగింది. దేని మీదైనా మనకు అవగాహన పెరుగుతున్న కొద్దీ.. దాని పై మన దృక్పధం కూడా మారుతూ వస్తోంది. అయితే ఒకోసారి గుడ్ ఆర్ బ్యాడ్ మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఉదాహరణకి మహేష్ బాబు సోదరి మంజులగారి ఫోర్స్ వల్లే నేను ‘పోకిరి’ సినిమా చేశాను. కానీ ఆ తరువాత ఆ సినిమా నా కెరీర్ కే మెయిన్ పిల్లర్ అయింది.

మీరు గమనించిన వాటిల్లో టాలీవుడ్ లో ఏమైన కొత్తగా మార్పులు చోటు చేసుకున్నాయా ?

లేదు. నాకు పెద్ద పెద్ద మార్పులు ఏమి కనిపించలేదు. కానీ సినిమా ప్రమోషన్స్ మాత్రం గతంలో కంటే ఇప్పుడు చాలా మారాయి. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు సినిమా పై ఇంట్రస్ట్ కలిగేలా మేకర్స్ అన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యడం బాగుంది.

తెలుగులో మీ పాత్రకు మీరు మొట్టమొదటిసారిగా డబ్బింగ్ చెప్పారు. అది ఎవరి ఐడియా ?

ఆ ఐడియా మా డైరెక్టర్ శ్రీను వైట్లగారిదే. మొదట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాంతో నేను డబ్బింగ్ ఇక చెప్పలేనని చెప్పేశాను. కానీ శ్రీనువైట్ల గారు పట్టు బట్టి మరి నా చేత డబ్బింగ్ చెప్పించారు. ఆయనతో పాటు ఆయన అసిస్టెంట్స్ కూడా నేను డబ్బింగ్ బాగా చెప్పడానికి సహకరించారు. తెలుగులో నా వాయిస్ వినాలని నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

భవిష్యత్తులో మీరు ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు ?

కథలో చెప్పుకోవడానికి తగినంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఉంటే చాలు. నాకు చెయ్యటానికి ఏం అభ్యంతరం లేదు. ఇక నాకు కూడా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. ముఖ్యంగా విమెన్ సెంట్రిక్ రోల్ ఉన్న చిత్రాలు చెయ్యాలని ఉంది. అలాంటి పాత్రలు గాని వస్తే తప్పకుండా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు