విక్రమ్ ‘ఇంకొక్కడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Published on Aug 21, 2016 7:35 pm IST

inkokkadu
హీరో విక్రమ్ గురించి తెలుగు, తమిళ సినీ అభిమానులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌతిండియన్ సినిమాలో పలు అద్భుతమైన ప్రయోగాలు చేసి, నటనపై తనకున్న మక్కువ చూపి అందరి మన్ననలూ పొందిన ఈ హీరో తాజాగా ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ సహా ఇతర కార్యక్రమాలన్నింటినీ చివరిదశకు చేర్చిన టీమ్, సినిమాను సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు తెలిపింది. మొదట సెప్టెంబర్ 9న విడుదల చేస్తారని ప్రచారం జరిగినా, లాంగ్ వీకెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుకు విడుదలను మార్చేసింది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నారు. ముఖ్యంగా లవ్ అనే పాత్ర సినిమాకే హైలైట్‍గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సరసన నయనతార, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తో ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయికి చేర్చింది. ఇక తన గత చిత్రాలు రెండు చిత్రాలూ పరాజయం పాలవ్వడంతో విక్రమ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

 
Like us on Facebook