ఛీ.. ఛీ.. బూతులో కూడా ‘క్రియేటివిటీ’నా ..!

Published on Feb 21, 2019 2:00 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం బూతు కంపు కొడుతుంది. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే అసహ్యమైన బూతు.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. డిజిటల్ యుగం వచ్చాక, బూతు రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం సినిమా తీస్తున్నామో, ఎలాంటి సినిమా తీస్తున్నామో.. అని కనీస అవగాహన కూడా లేకుండా.. బూతు రాయుళ్లు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. బూతులో కూడా క్రియేటివిటీని చూపిస్తూ.. డీసెంట్ ప్రేక్షకులకు సినిమా పైనే ఏవగింపు కలిగేలా చేస్తున్నారు.

ఈ మధ్య విడుదల అయిన ‘ఉమెన్స్ నాట్ ఎలౌడ్’ అనే ఓ సినిమా ట్రైలర్ చూశాకా.. బూతును ఆశించే యూత్ కూడా.. ఆ సినిమా మేకర్స్ ను అలాంటి సినిమాను తీస్తున్నందుకు కసి తీరా బండ బూతులు తిట్టకుండా మానరు. నిజానికి తెలుగు సినిమాల్లో విపరీతమైన అడల్ట్ కంటెంట్ ను మన ప్రేక్షకులు తొందరగా జీర్ణించుకోలేరు. అందుకే ఒకప్పుడు మూతి మూతి రాసుకున్నే ముద్దు సీన్స్ ను కూడా సెన్సార్ సభ్యులు కట్ చేసేవారు. కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న సినిమాల్లో ముద్దు సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి.

దాంతో.. మేకర్స్ ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆత్రుతలో అవసరం ఉన్నా లేకపోయినా మూడు ముద్దు సీన్స్.. ఆరు రొమాంటిక్ సాంగ్స్ తో సినిమాని చుట్టేసి ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. అయితే ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి కొన్నిటిని కంటెంట్ పరంగా ప్రేక్షకులు ఆదరించడంతో.. బూతు వల్లే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. మొత్తానికి ‘ఎక్స్’ పండితులు ‘ఉమెన్స్ నాట్ ఎలౌడ్’, ‘ఏడు చేపల కథ’, ‘చీకట్లో చితక్కొట్టుడు’, 4 లెటర్స్, ఆ మధ్య వచ్చిన ‘24 కిస్సెస్’, రధం, నటన, నాటకం లాంటి సినిమాలతో మన మీదకు దండయాత్రకు వస్తున్నారు.

వీటిల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా.. మళ్ళీ ఆ సినిమా ప్రేరణతోనే అలాంటి సినిమాలు పదుల్లో పుట్టుకొస్తాయి. మళ్ళీ పొరపాటున మన ఖర్మ కొద్దీ వాటిల్లో ఒక్క సినిమా హిట్ అయినా.. ఇక అలా అలా ఆ పరంపర కొనసాగుతూ.. అలాంటి సినిమాలు మాములే అనే స్థాయికి టాలీవుడ్ చేరుతుంది. అసలు ఇలాంటి సినిమాలు కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తే.. ఆ సినిమాల మేకర్స్ తో పాటు టాలీవుడ్ కి కూడా మేలు జరుగుతుంది. మరి అప్ కమింగ్ మేకర్స్ అన్నా ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :