Cocktail 2: ముందే భయపడ్డ షాహిద్ కపూర్.. ‘బంధు 2.0’ సాంగ్‌తో వాళ్లకు వాళ్లే ట్రోల్ చేసుకుంటున్న బాలీవుడ్!

Cocktail 2: ముందే భయపడ్డ షాహిద్ కపూర్.. ‘బంధు 2.0’ సాంగ్‌తో వాళ్లకు వాళ్లే ట్రోల్ చేసుకుంటున్న బాలీవుడ్!

Published on Jun 17, 2026 6:21 PM IST

ముఖ్య అంశాలు

  • ‘కాక్‌టెయిల్ 2’ సినిమాలోని ‘బంధు 2.0’ పాటపై నెట్టింట భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
  • ఈ పాటకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో.. రీమిక్స్ సాంగ్స్ చేస్తే విమర్శలు తప్పవని షాహిద్, కృతి, రష్మిక వాళ్లకు వాళ్లే సెటైర్లు వేసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది.
  • కొందరు ఈ పాట కొత్త వైబ్‌తో అదరగొట్టిందని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం పాత పాటకు ఉన్న ఆరాను చెడగొట్టారని పెదవి విరుస్తున్నారు.

పాత హిట్ పాటలను రీమిక్స్ చేయడం బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. కానీ, ఒక ఐకానిక్ సాంగ్‌ను రీక్రియేట్ చేసేటప్పుడు వచ్చే విమర్శలను ముందే ఊహించి, తమను తామే ట్రోల్ చేసుకోవడం మాత్రం కాస్త వెరైటీనే. ఇప్పుడు ‘కాక్‌టెయిల్ 2’ సినిమా టీమ్ సరిగ్గా ఇదే చేసింది. 2012లో రిలీజైన ‘కాక్‌టెయిల్’ సినిమాలో ‘తుమ్ హీ హో బంధు’ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాటకు ‘బంధు 2.0’ పేరుతో ఒక కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చారు. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నలపై చిత్రీకరించిన ఈ పాటను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అయితే, ఈ పాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ పాట కోసం చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత పాటను రీక్రియేట్ చేస్తే కచ్చితంగా నెగెటివ్ కామెంట్స్ వస్తాయని ఈ వీడియోలో షాహిద్ ముందే హెచ్చరించడం.. దానికి కృతి సనన్, రష్మిక తమదైన స్టైల్‌లో బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. పాట షూట్ పూర్తయ్యాక కూడా “మనం అదరగొట్టాం.. అయినా ట్రోల్స్ తప్పవేమో” అంటూ వాళ్లు సరదాగా మాట్లాడుకున్నారు. దీన్ని చూసిన ఒక నెటిజన్.. “జనాలు ట్రోల్ చేసేలోపు వాళ్లకు వాళ్లే ట్రోల్ చేసుకుంటున్నారు, ఇదంతా బజ్ క్రియేట్ చేయడానికి ఆఖరి నిమిషంలో వేసిన ప్లాన్ లాగా ఉంది” అని కామెంట్ చేశారు. ముందే విమర్శలు వస్తాయని తెలిసీ కూడా ఈ పాటను ఎందుకు చేశారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొదట ట్రోల్స్ వచ్చే పనులు చేయడం, ఆ తర్వాత మేమే ట్రోల్ అవుతాం అని కవర్ చేసుకోవడం బాలీవుడ్ వాళ్లకు అలవాటుగా మారిందని సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు ఈ పాటలోని కొన్ని అంశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ సాంగ్‌లో ఎలాంటి ఆరా లేదని, అవసరం లేని బీట్స్ యాడ్ చేసి పాటను చెడగొట్టారని కొందరు పెదవి విరుస్తున్నారు. అలాగే కృతి, రష్మిక డాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తోందని తప్పుబడుతున్నారు. పాత పాటలో డయానా పెంటీ ఇచ్చిన ఇన్నోసెన్స్ ఇందులో మిస్ అయ్యిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

అయితే, ఈ పాటను నెగిటివ్ చేసేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. పాజిటివ్‌గా స్పందించేవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. షాహిద్ కపూర్ ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో ఇరగదీశాడని, పాత పాట ఫీల్‌ను ఎక్కడా చెడగొట్టకుండా కొత్త వైబ్‌ను తీసుకొచ్చారని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. షాహిద్, కృతి, రష్మికల కాంబినేషన్ స్క్రీన్ మీద ఫైర్ లాగా పేలిందని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 19, 2026న థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్స్ కోసమే మేకర్స్ ఈ ట్రోలింగ్ స్ట్రాటజీని వాడారో లేక నిజంగానే పాటపై నెగెటివిటీ వస్తుందో అనేది పక్కనపెడితే.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రం ‘బంధు 2.0’ చుట్టూ భారీ చర్చే నడుస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు