ఇంటర్వ్యూ: ఆది – ‘ప్యార్ మే పడిపోయానే’ స్టొరీ లైన్ ‘ఆషికీ 2’ ని పోలి ఉంటుంది.

ఇంటర్వ్యూ: ఆది – ‘ప్యార్ మే పడిపోయానే’ స్టొరీ లైన్ ‘ఆషికీ 2’ ని పోలి ఉంటుంది.

Published on May 9, 2014 6:45 PM IST

Aadi1
‘ప్రేమకావాలి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన యువ హీరో ఆది, తన మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నాడు. తన నాలుగు ఏళ్ల కెరీర్ లో కేవలం మూడు సినిమాలే చేసిన ఆది మరో లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు. ‘సుకుమారుడు’ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ ఆది మే 10న విడుదల కానున్న ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. ఈ సందర్భంగా ఆదితో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. తన కొత్త సినిమా గురించి, తన కెరీర్ గురించి ఆది పంచుకున్న విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా ఎలా ఉండబోతుంది?

స) ‘సుకుమారుడు’ సినిమా తరువాత ఒక లవ్ స్టొరీ చేయాలని అనుకుంటున్నప్పుడు రవి కుమార్ చావాలి నాకు ఈ కథ చెప్పారు. ఈ సినిమా చాలా ఫ్రెష్ గా, పూర్తి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే యువతకు నచ్చే ఒక మాజికల్ లవ్ స్టొరీ. ఎలాంటి అంచనాలను పెట్టుకోకుండా వస్తే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి? అలాగే ఎప్పటిలానే ఈ మూవీలో కూడా మంచి స్టెప్స్ వేసారా?

స)  ఈ సినిమాలో నేను ఒక సంగీత దర్శకుడిని, అలాగే హీరోయిన్ శాన్వి ఒక సింగర్. ప్రేమపై నమ్మకం లేని వాడు ఒక అమ్మాయిని నిజాయితీగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేదే నా క్యారెక్టర్. కానీ ఈ క్యారెక్టర్ ఎవ్వరికీ ఎలాంటి భాధ కలిగించకుండా ఎప్పుడు నవ్విస్తూనే ఉంటుంది. ఈ సినిమా స్టొరీ లైన్ చెబితే అందరూ ‘ఆషికీ 2’ అంటారు, కానీ ఇది పూర్తిగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుంది. ఇక డాన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్ద డ్యాన్సు మూమెంట్స్ ఏమి లేక పోయినప్పటికీ, ఒక పాటలో మాత్రం హిప్ హాప్ తరహలో స్టైలిష్ డ్యాన్స్ చేశాను.

ప్రశ్న) మొదటి సారి డైరెక్టర్ రవి చావాలి లవ్ స్టొరీని ఎలా డీల్ చేసాడు?

స)  రవి చావలి గారికి ఇది మొదటి లవ్ స్టొరీ, అయన ఇప్పటివరకు తీసిన సినిమాలన్ని సందేశాత్మక చిత్రాలే. కానీ ఈ సినిమాలో మాత్రం ఎలాంటి సందేశాలు ఉండవు. ప్రేమ కథలు తీయడం రవి చావాలి గారికి కొత్త అయినప్పటికీ చాలా బాగా తీసారు.

ప్రశ్న) ఈ సినిమాకి శాన్విని ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

స)  ‘లవ్లీ’ సినిమాలో నాది శాన్వి జంట బాగుందని అందరూ అన్నారు, అందుకనే ఆ అమ్మాయిని తీసుకుందాం అని అనుకున్నాం. అంతేకాకుండా ఈ సినిమాలో క్యారెక్టర్ కి కూడా శాన్వి బాగా సరిపోయింది. ‘ప్యార్ మే పడిపోయానే’ హిట్ అయితే, ఇంకో సినిమా కూడా చేస్తామేమో.

ప్రశ్న)  నిర్మాత రాధామోహన్ గురించి ఏమైనా చెబుతారా?

స)  రాధామోహన్ గారితో కలిసి చాలా రోజుల నుండి ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కేవలం మూడు రోజుల ముందు సినిమా విడుదలపై ఒక నిర్ణయం తీసుకుని ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాం అంటే అది కేవలం అయన ధైర్యం వల్ల మాత్రమే. నా అదృష్టం ఏంటో నాకు అందరూ మంచి నిర్మాతలే దొరుకుతున్నారు.

ప్రశ్న)ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని తీసుకోవడం ఎవరి చాయిస్?

స)  నాకు అనూప్ కి మంచి అనుబంధం ఉంది, కానీ ఈ సినిమాకి అనూప్ కావాలని మాత్రం దర్శకుడు రవి చావాలి గారే అడిగారు. కేవలం నాకు అనూప్ కి ఉన్న అనుబంధంతోనే చాలా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అనూప్ ఈ సినిమాకి ఒప్పుకున్నాడు. అనూప్ సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

ప్రశ్న) మీరు సినిమా సినిమాకి మధ్య ఎందుకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు?

స)  సినిమా సినిమాకి మధ్య కావాలని తీసుకున్నది కాదు, ఏదో అనుకోకుండా జరిగిందే. ఈ ఏడాది మాత్రం కచ్చితంగా మూడు సినిమాలు విడుదల చేయాలని అనుకుంటున్నాన.

ప్రశ్న) లవ్ కి సంబంధించిన టైటిల్స్ పెట్టడం మీకు సెంటిమెంటా?

స)  లవ్ టైటిల్స్ పెట్టడం సెంటిమెంట్ కాదు, కానీ అలాంటి టైటిల్స్ పెట్టిన రెండు సినిమాలు హిట్ అవగానే మనకు తెలియకుండానే అది సెంటిమెంట్ అయిపోయింది. కథను బట్టి సినిమాకి టైటిల్ నిర్ణయిస్తాం, అయినా ఏ టైటిల్ పెట్టినా సినిమా ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా ఉండి, ఎంటర్టైన్మెంట్ ఉంటే అది తప్పకుండ విజయం సాధిస్తుందని నా అభిప్రాయం.

ప్రశ్న) కన్నడలో కూడా మీకు అవకాశాలు వస్తునాయట, నిజమేనా?

స)  అవును, కన్నడలో ఇప్పటికే చాలా మంది సినిమా చేయాలనీ అడుగుతున్నారు. కానీ తెలుగులో ప్రూవ్ చేసుకున్నాకే కన్నడలోకి వెళ్తాను.

ప్రశ్న) మీరు సిక్స్ ప్యాక్ చేశారని విన్నాం నిజమేనా?

స)  అవును, నా తదుపరి సినిమా ‘రఫ్’ కోసం దర్శకుడు కథకి అవసరం అంటే సిక్స్ ప్యాక్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఆ సినిమాను కూడా త్వరలోనే విడుదల చేస్తాం.

ప్రశ్న) మీ నాన్నగారు సాయి కుమార్ లా మీరు కూడా పవర్ఫుల్ సినిమాలు చేయాలనుకుంటున్నారా? అలాగే మీ నాన్నగారితో ఏమన్నా సినిమా చేస్తారా?

స)  పవర్ఫుల్ అని కాదు కానీ కామన్ మ్యాన్ ని రెప్రజెంట్ చేసే సినిమాలు చేయాలని ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం నా వయస్సుకు తగట్టు మంచి ఎంటర్టైనర్స్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే మేము ఇద్దరం కలిసి నటించే కథ వస్తే తప్పకుండా చేస్తాం, అంతేకాని మేము కలిసి చేయాలనే ఉద్దేశంతో కథని మాత్రం వెతుక్కోం.

అంతటితో ఆది కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం.

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు