ఇంటర్వ్యూ : చందూ మొండేటి – ఆ విషయంలో భయపడలేదు ఎక్కువ బాధపడ్డాను !

8th, October 2016 - 09:42:50 PM

chandu-mondeti
మలయాళ ‘ప్రేమమ్’ ను నాగ చైతన్య హీరోగా తెలుగులోకి కూడా ‘ప్రేమమ్’ పేరుతోనే రీమేక్ చేసి మంచి సక్సెస్ ను అందుకుని పరిశ్రమలోని అందరి చూపు తన వైపుకి తిప్పుకున్న యువ దర్శకుడు ‘చందూ మొండేటి’. ఆయన ఈ చిత్రం ఇంతటి విజయం సాధించడానికి కారణాలను, సినిమాను రూపొందించేటప్పుడు వారి అనుభవాలను, సక్సెస్ ఇచ్చిన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ విజయం పట్ల నాగార్జున గారు ఎలా స్పందించారు ?

జ) నాగార్జునగారు ఈ సక్సెస్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలా రోజుల క్రితమే ఆయన సినిమా చూసి బాగుందని ప్రోత్సహించారు. ఆయనిచ్చిన కాన్ఫిడెన్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చాలా బాగా చేయగలిగాం.

ప్ర) ముందుగా చైతన్యగారి దగ్గరికి కొత్త కథ తీసుకెళ్లారని విన్నాం. కానీ రీమేక్ సినిమా ఎందుకు చేయాల్సొచ్చింది ?

జ) అవునండీ.. ముందు ఓ కొత్త సబ్జెక్ట్ టోన్ సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ ప్రేమమ్ రిలీజయ్యాక దాన్ని చూసి సినిమా చాలా బాగుందని ఆయనకు చెప్పా. అంతకు ముందే కొందరు ప్రేమమ్ ను రీమేక్ చేద్దామని ఆయన్ను అడిగారు. నేను కూడా సినిమా బాగుందని చేయొచ్చని చెప్పాక అదే చేద్దామని నిర్ణయించుకుని చేశాం.

ప్ర) రీమేక్ చేశారు సరే. మరి పేరెందుకు మార్చలేదు ?

జ) మొదట ఈ సినిమాకి ‘మజ్ను’ అనే టైటిల్ పెడదామని అనుకున్నాము. కానీ చాలా మంది పెద్దవాళ్ళు అలా పెడితే శాడ్ స్టోరీ అనే అభిప్రాయం ఏర్పడుతుందని పెట్టొద్దన్నారు. అందుకే సంస్కృతంలో ప్రేమకు అసలు పదం ‘పేమమ్’ కాబట్టి ఏ భాషకైనా సరిపోతుందని అదే పెట్టేశాం.

ప్ర) మలర్ పాత్రకు శృతి హాసన్ నే ఎందుకు తీసుకున్నారు ?

జ) సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లలో ఒక స్టార్ ఉంటె బాగుంటుందని ఆమెను తీసుకున్నాం. ఆమె క్రౌడ్ పుల్లర్. పైగా ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒప్పేసుకున్నారు. ఈ సినిమాలో కనీసం ఆమె మేకప్ కూడా వేసుకోలేదు. అంత నాచ్యురల్ గా చేశారు.

ప్ర) నాగ చైతన్య ఈ సినిమాలో చాలా బాగా నటించారు. కారణం ?

జ ) అవును చాలా బాగా నటించారు. మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపారు. ఆయన్ను అలా మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ లో చూడటం వలన ఆయన నటన అందరికీ బాగా నచ్చింది.

ప్ర) ఈ సినిమా తీసేటప్పుడు నెగెటివ్ పబ్లిసిటీ వచ్చింది కదా? ఏమైనా భయపడ్డారా ?

జ ) భయపడలేదుగాని భాధపడ్డాను. చాలా మంది పలానా సీన్ బాగా లేదు. బాగా రాదు. అనవసరంగా చెడగొడతారు అన్నారు. అలా అనేటప్పటికీ బాధనిపించింది.

ప్ర) సినిమా తీసేప్పుడు ఒరిజినల్ వెర్షన్ కి పని చేసిన వాల్ హెల్ప్ తీసుకున్నారా ?

జ) సినిమా విషయంలో ఒరిజినల్ వెర్షన్ కు పనిచేసిన వాళ్ళని పెద్దగా కలవలేదు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు మాత్రమే కలిసి కొన్ని అంశాలు డిస్కస్ చేశాం. కానీ మ్యూజిక్ కోసం ఒరిజినల్ వెర్షన్ కు పనిచేసిన రాజేష్ మురుగేషన్ ను తీసుకున్నాం. పర్టిక్యులర్ గా నాలుగు పాటల కోసం ఆయన్ను తీసుకున్నాం.

ప్ర) ఇక ఫ్యూచర్ లో కూడా రీమేక్ సినిమాలు చేస్తారా ?

జ) నాకు స్పూర్తినిచ్చే కథలు ఏమైనా దొరికి అవి చేయగలను అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను.

ప్ర) ఇక మీదట ఎలాంటి సినిమా తీయాలని ఉంది ?

జ) నాకు సైన్స్ ఫిక్షన్ అంటే చాలా బాగా ఇష్టం. నా దగ్గర అలాంటి కథలే ఎక్కువగా ఉన్నాయి. ఆ జానర్ లో మంచి మంచి సినిమాలు తీయాలని ఆశ. అలాంటివి బాగా తీయగలననే నమ్మకం కూడా నాకు ఎక్కువ.

ప్ర ) అయినా సైన్స్ ఫిక్షన్ అంటే రిస్క్ కదా. మరి అంట నమ్మకం ఏంటి ?

జ) సైన్స్ ఫిక్షన్ అంటే తెలియని కొత్త విషయాన్నీ పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా పోయినా ఎదో కొత్త విషయం చెప్పాడు అనే పేరున్నా ఉంటుంది. అందుకే అవంటే నాకు ఎక్కువ నమ్మకం.

ప్ర) మీరు వెంకటేష్ గారికి ఎదో కథ చెప్పారని విన్నాం ?

జ) అవునండీ చెప్పాను. అదొక పోలీస్ స్టోరీ. ఆయనకు కూడా నచ్చింది. అలాగే నాగార్జునగారికి కూడా ఒక కథ చెప్పా. అది కూడా ఆయనకు బాగా నచ్చింది. కానీ అవి ఎప్పుడు వర్కవుట్ అవుతాయో చెప్పలేం.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?ఎవరితో చేస్తారు ?

జ) ఐ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ తో ఓ సినిమా అనుకుంటున్నాను. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒకటి, దిల్ రాజు గారితో మరొకటి అనుకుంటున్నాను. ఏది ముందు మెటీరియలైజ్ అయితే అది చేస్తాను. ఏదైనా సరే 2017 జనవరి కల్లా ఒక సినిమా ఉంటుంది.