ఇంటర్వ్యూ : నాగార్జున – `మ‌న్మ‌థుడు 2` సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ !

ఇంటర్వ్యూ : నాగార్జున – `మ‌న్మ‌థుడు 2` సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ !

Published on Aug 7, 2019 4:30 PM IST

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడారు. మరి సినిమా గురించి నాగార్జున వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు నాగార్జున మాటల్లోనే.

.

`మ‌న్మ‌థుడు 2`ఆగస్టు 9న విడుదల కాబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?

నేను చాలా సినిమాలు చేసినప్పటికీ, కొత్త కథల పై , మనసుకు దగ్గరైన కథల పై కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. అలాంటి కథే `మ‌న్మ‌థుడు 2` కూడా. సినిమాలో ఎమోషన్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే, స్క్రిప్ట్‌ చాల బాగున్నా.. సినిమా పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేనూ ఆసక్తిగా ఉన్నాను.

 

రాహుల్ ర‌వీంద్ర‌న్ దర్శకత్వం గురించి ?

తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’ చూసిన తరువాత, ముఖ్యంగా అతను సినిమా తీసిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. పైగా రాహుల్ కూడా నన్ను కొత్తగా చూపించాలని అనుకున్నాడు. ఖచ్చితంగా తను తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అన్నిటికిమించి రాహుల్ ఈ చిత్రాన్ని అందమైన కుటుంబ భావోద్వేగాలు హైలెట్ అయ్యేలా తెరకెక్కించాడు.

 

ఈ సినిమాలో చాలా పదాలు సెన్సార్ ద్వారా ఎందుకు మ్యూట్ చేయబడ్డాయి?

మీరు సినిమా చూసిన తర్వాత ఈ ప్రశ్న అడగాలి. సినిమాలోని అన్ని పదాలు సీన్స్ కు క్యారెక్టర్స్ కు తగ్గట్లు ఉంటాయి. అయినా.. మీరు అంటున్న ఆ పదాలు ఎక్కడా సినిమాకి దూరంగా అనిపించవు. సినిమా ప్లోలో వెళ్తాయి.. పైగా వాటిని అందరూ ఇష్టపడతారు.

 

రకుల్ ప్రీత్ సింగ్‌ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ?

ఈ సినిమా ప్రారంభంలో అనుకుంటా.. రకుల్ ఈ సినిమాలో నటించడం.. నాకు ఇష్టంలేదని వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లు మాత్రమే. సినిమాలో రకుల్ పాత్ర చాలా బాగుంటుంది. తను కూడా అవంతిక పాత్రలో చాల బాగా నటించింది.

 

సినిమాలోని కామెడీ యాంగిల్ గురించి ?

మన్మథుడులో బ్రహ్మానందం అలాగే త్రివిక్రమ్ రైటింగ్ తో ఫుల్ కామెడీని పండించారు. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా వెన్నెల కిషోర్ మరియు మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా ఫుల్ గా నవ్విస్తాయి. ఈ చిత్రంలోని కామెడీ బాగా వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నాను.

 

ఈ వయసులో ఇలాంటి పాత్రలో నటించడం ఇబ్బందిగా అనిపించలేదా ?

ఇబ్బంది ఏముంది. మంచి కథ.. అయితే సినిమాలో నా క్యారెక్టర్ ను తెలివిగా వివరించినందుకు రాహుల్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇక రొమాన్స్ కంటే కూడా, ఈ సినిమాలో హాస్యభరితమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుంది.

 

సినిమాలో మీ పాత్ర?

సినిమాలో నాది మధ్య వయస్కుడైన ఓ సరదా ప్రేమ బ్రహ్మచారి పాత్ర. సినిమాలో నాకు ముగ్గురు సోదరీమణులు అలాగే తల్లి ఉంటారు. అయితే నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను వివాహం చేసుకోవాలని వాళ్లు నన్ను బలవంతం చేస్తారు. వారిని సంతృప్తి పరచడానికి సినిమాలో నేను ఏమి చేస్తాను అనేది మిగతా కథ.

 

‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ఎంతవరకు వచ్చింది ?

దాదాపు సంవత్సరం నుండి ఆ సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ జరుగుతుంది. అయితే కళ్యాణ్ కృష్ణ సోదరుడు చనిపోవడం వల్ల ప్రస్తుతానికి ఆ సినిమాకి సంబధించిన పనులన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. నేను ప్రస్తుతం బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నాను. దాన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను.

 

బాలీవుడ్‌ లో ప్రస్తుతం మీరు ఒక సినిమా చేస్తున్నారు. బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేస్తారా?

లేదు, నేను అక్కడ బ్రహ్మాస్త్రా సినిమా మాత్రమే చేశాను, ఎందుకంటే నేను చేసిన పాత్రను నాకు బాగా నచ్చింది.ఇక బాలీవుడ్ లో సినిమాలు చేసే ఆలోచన అయితే లేదు. నా దృష్టి అంతా తెలుగు సినిమాల పైనే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు