ఇంటర్వ్యూ : రజనీకాంత్ – తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్లు.

ఇంటర్వ్యూ : రజనీకాంత్ – తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్లు.

Published on Nov 27, 2018 3:32 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న ‘2.ఓ’ చిత్రం నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నధంగా ఉంది.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

సర్.. ‘రోబో’కి మరియు ‘2.ఓ’ కి మధ్య వర్కింగ్ పరంగా గాని, సబ్జెక్ట్ పరంగా శంకర్ గారిలో మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏమిటి ?

‘రోబో’ని ఆయన చాలా బాగా డీల్ చేశారు. అయితే రోబోతో పోల్చుకుంటే ఈ సినిమాకి వచ్చేసరికి శంకర్ లో కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా ఫారెన్ టెక్నీషియన్స్ ను డీల్ చేసే విషయంలో గాని, వారి నుండి వర్క్ ను రాబట్టుకోవడంలో గాని, ఆయనలో నేను గతంతో పోల్చుకుంటే.. ఈ సినిమా వర్కింగ్ ప్రాసెస్ లో చాలా పరిపక్వత చుసాను.

కానీ ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివర్లో ఏ సినిమాకి పడనంత టెన్షన్ పడ్డాను అన్నారు ?

నా ముందు ఎప్పుడూ అలా టెన్షన్ పడింది లేదు గాని, ఆ విషయం గురించి అయితే నేను విన్నాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివర్లో అంటే విఎఫ్ ఎక్స్ విషయంలో కొంత డిస్టర్బ్ అయ్యారు. ఆయన అనుకున్న విధంగా విఎఫ్ ఎక్స్ రాలేదు అందుకే ఆయన టెన్షన్ పడి ఉంటారు. కానీ ఆ తరువాత ఆయన పూర్తీ సంతృప్తి చెందేవిధంగా విఎఫ్ ఎక్స్ అవుట్ ఫుట్ వచ్చింది.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరేమైనా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యారా ?

నేను ఈ సినిమాకి ఛాలెంజింగ్ గా ఫీల్ అవ్వలేదు గాని, రోబో వన్ కి నేను కొంత వరకు ఛాలెంజింగ్ గా
ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ టైపు ఆఫ్ యాక్షన్ సీన్స్ మొదటి సారి ఆ సినిమాలోనే చేసింది. ఇక ‘2.ఓ’కి అలా చాలెంజింగ్ ఏం అవ్వలేదు. కారణం మా డైరెక్టర్ శంకర్ అనే చెప్పాలి.

ఈ సినిమా గురుంచి చెప్పండి ?

ఈ ‘2.0’ చిత్రం కోసం ప్రేక్షకులు లాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే సినిమాలో 45 శాతం గ్రాఫిక్స్ ఉంటుంది. అందుకే మాక్కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆసక్తిగా ఉంది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన కథ కూడా ఉంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉన్న సినిమా అయినా, ఆ సినిమాని నడిపించేది ఆ కథ. అలాంటి కథ ఉన్న సినిమా ఈ ‘2.0’. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అన్నారు.

ఈ సినిమాని త్రీడి లాంటి అద్భుతమైన సాంకేతికతో భారీ స్థాయిలో రూపొందించారు. కానీ ప్రమోషన్స్ మాత్రం ఆ స్థాయిలో లేవని అంటున్నారు..?

అసలు ఈ సినిమాకు ప్రమోషనే అవసరం లేదు. ఇప్పటికే టికెట్లు ఫుల్ అయిపోయాయి. మరి అలాంటి సినిమాకి ప్రమోషన్ అవసరమా. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోన్న ప్రసాద్ గారు (నవ్వుతూ) అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది..?

ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ చేసిన హార్డ్ వర్క్ ఎంతో గొప్పది. ఈ చిత్రానికి ఆయన తప్ప ఇంకెవరూ అలా చెయ్యలేరు. ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అక్షయ్ కుమారే. అదే విధంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీ తెలుగు అభిమానులు గురించి ఏం చెబుతారు ?

తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్లు. అందుకే తెలుగు వాళ్లని అందరూ ఇష్టపడతారు. తెలుగు గొప్పతనాన్ని మహాకవి భారతీనే గొప్పగా మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా కోసం వాళ్లు చూసినట్లే నేను ఎదురుచూస్తున్నాను. 1975లో నేను నటించిన మొదటి చిత్రం అపూర్వరాగంగల్‌ చిత్రాన్ని చూడాలని ఎంత ఆసక్తిగా ఎదురు చూశానో.. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఈ 2.0 చిత్రం కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు