
రెజీనా.. తెలుగులో ప్రస్తుతమున్న జనరేషన్ హీరోయిన్లలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్. తన అందం, అభినయంతో తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని దూసుకుపోతోన్న రెజీనా నటించిన తాజా సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. సాయిధరమ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘పిల్లా నువ్వులేని జీవితం’ లాంటి హిట్ తర్వాత మళ్ళీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ వస్తున్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్ ఎలా ఉండబోతోంది?
స) పిల్లా నువ్వులేని జీవితం సినిమా నా కెరీర్‌కు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత వస్తోన్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంతకు రెట్టింపు విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. హరీష్ శంకర్ గారి సినిమాల స్టైల్లో అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్నీ ఉన్నాయి.
ప్రశ్న) ‘సీత ఇక్కడ’ అంటూ వస్తున్నారు. ఇంతకీ సీత రోల్ ఎలా ఉండబోతోంది?
స) (నవ్వుతూ) ట్రైలర్లో వచ్చే ఈ డైలాగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సీత ఒక అందరిలాంటి సాధారణ అమ్మాయి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమాయకురాలైన అమ్మాయిగా సీతను చెప్పుకోవచ్చు. ఈ పాత్ర దాదాపుగా ప్రతీ అమ్మాయి తమను తాము ఎక్కడో ఓ చోట ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుంది. కచ్చితంగా ఈ రోల్ నా కెరీర్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనుకుంటున్నా. నన్ను నేను కూడా ఈ పాత్రలో చాలాసార్లు చూసుకున్నా.
ప్రశ్న) ఈ సినిమాలో కొంత గ్లామరస్‌గా కనిపిస్తున్నట్లున్నారు?
స) గ్లామరస్‌గా కనిపించడం అంటే ఏంటో నాకు అర్థం కాదు. దర్శకుడు ఒక పాత్రను డిజైన్ చేసిన విధానం బట్టి ఒక గ్లామర్ లుక్ కావాల్సి ఉంటుంది. దీనర్థం స్కిన్ షో కాదని నా అభిప్రాయం. పాత్రకు తగ్గట్టుగా గ్లామరస్‌గా కనిపించడం వేరు. స్కిన్ షో వేరు. ఈ సినిమాలో హరీష్ శంకర్ డిజైన్ చేసిన పాత్రకు తగ్గట్టుగా గ్లామరస్‌గానే కనిపిస్తున్నా.
ప్రశ్న) హీరో సాయిధరమ్ తేజ్‌తో మీకిది రెండో సినిమా. సాయిధరమ్ తేజ్ సరసన నటించడం గురించి చెప్పండి?
స) సాయిధరమ్ తేజ్ ఓ మంచి ఫ్రెండ్. తేజ్‌తో కలిసి నటించడం సరదాగా ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఒక సీన్ కోసం రెడీ అవ్వాలన్నప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడుకొని ముందే రిహార్సల్స్ చేస్తుంటాం. చెప్పాలంటే.. పిల్లా నువ్వులేని జీవితం సినిమాలోకంటే ఈ సినిమాలోనే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలున్నాయి.
ప్రశ్న) దర్శకుడు హరీష్ శంకర్ గురించి చెప్పండి?
స) దర్శకుడు హరీష్ శంకర్ ఏదైనా అనుకున్నారంటే అది జరిగిపోవాలంతే! సినిమాకు ఏమేం కావాలన్న విషయంలో ఆయనకు అద్భుతమైన క్లారిటీ ఉంది. నటీనటులకు కూడా కంఫర్ట్ ఇస్తూనే తనకు కావాల్సిన ఔట్పుట్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటారు.
ప్రశ్న) ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ అమెరికాలో జరిగింది కదా. ఆ షెడ్యూల్ అనుభవాల గురించి చెప్పండి?
స) ఈ సినిమా విషయంలో అమెరికాలో జరిగిన షూటింగ్ టైమ్‌ను ది బెస్ట్ టైమ్ అనే చెబుతా. సినిమా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఒకే బస్‌లో ప్రయాణించడం దగ్గర్నుంచీ, అంతా సరదా సరదాగా గడిచిపోయింది. ఇక ‘సీత ఇక్కడ’ అంటూ ఓ ఎమోషనల్ సీన్ చేసే టైమ్‌కి, ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంది. నేనేమో ఏడుస్తూ సీన్ చేయాలి. ఈ సీన్ కోసం దాదాపుగా 34 టేక్స్ తీసుకున్నా. ఈ ఒక్క సీన్ కోసం మాత్రం చాలా కష్టపడ్డా.
ప్రశ్న) ‘గువ్వా గోరింకతో’ అనే చిరంజీవి సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?
స) గువ్వా గోరింకా పాటను ఈ సినిమాకు రీమిక్స్ చేయడం, నేను ఆ పాటకు డ్యాన్స్ చేయడం.. అంతా నా అదృష్టం. ఇప్పటివరకూ నేను చేసిన ఏ సినిమాలోనూ సుబ్రమణ్యం ఫర్ సేల్‌లో చేసినంతగా డ్యాన్స్ మూవ్మెంట్స్ చేయలేదు. ఇది నాకు ఓ ప్రత్యేక అనుభవమనే చెప్తా.
ప్రశ్న) సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు హైలైట్స్ అంటే ఏం చెప్తారు?
స) ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేయదగ్గ ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ఏ జానర్ సినిమాలను ఇష్టపడే వారికైనా ఈ సినిమా నచ్చుతుంది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా ఓ హైలైట్‌గా నిలుస్తుంది.
ప్రశ్న) ఇప్పటివరకూ నటిగా మీ ప్రయాణం ఎలా ఉంది. తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి?
స) నటిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకూ అంతా చాలా హ్యాపీగా సాగిపోతోంది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక సందీప్ కిషన్‌తో కలిసి చేసిన చేసిన ఓ తమిళ సినిమా ఈ డిసెంబర్లో విడుదల కానుంది.

