ఇంటర్వ్యూ : శ్రీను వైట్ల – చరణ్ లో ఎన్నడూ చూడని సెన్సాఫ్ హ్యూమర్ ని ‘బ్రూస్ లీ’లో చూస్తారు.

ఇంటర్వ్యూ : శ్రీను వైట్ల – చరణ్ లో ఎన్నడూ చూడని సెన్సాఫ్ హ్యూమర్ ని ‘బ్రూస్ లీ’లో చూస్తారు.

Published on Oct 12, 2015 2:06 PM IST

srini-vitla
యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అనే మూడు అంశాలను బాగా మిక్స్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్న సినిమాలు తీసే డైరెక్టర్ శ్రీను వైట్ల. ఆయన తీసిన ఆగడు సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈ సారి సరైన కథతో కచ్చితంగా హిట్ కొట్టాలని రామ్ చరణ్ తో చేసిన సినిమా ‘బ్రూస్ లీ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల ఆగడు అనే ఫ్లాప్ ఇచ్చిన అనుభవాలను, బ్రూస్ లీ సినిమా ఎలా ఉండబోతుంది అనే అనుభవాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘ఆగడు’ అనే ఒక ఫ్లాప్ సినిమా తర్వాత బ్రూస్ లీ సినిమాతో ఏ మేరకు ఎంటర్టైన్ చేయబోతున్నారు.?

స) మనం సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనే మాటని పెద్దలు చెబుతుంటారు. అలానే నేను ఆగడు ఫ్లాప్ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటి అంటే.. సినిమాని రెండు పద్దతుల్లో చెబుతారు.. మొదటిది.. ఓ మంచి కథని తీసుకొని దాని ఎంటర్టైనింగ్ గా చెప్పడం. రెండవది.. ఎంటర్టైన్మెంట్ కోసం ఒక కథని చెప్తూ సినిమా చెయ్యడం. ఈ రెండు పద్దతుల్లో నేను సినిమాలు చేసాను. కానీ మొదటి ఫార్మాట్(వెంకీ, డీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలు)లో నాకు సక్సెస్ లు వచ్చాయి. సెకండ్ ఫార్మాట్ లో అనుకున్న స్థాయి ఫలితాలు రాలేదు. అందుకే బ్రూస్ లీ కోసం ఓ మంచి కథని అనుకొని దానిని ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి ట్రై చేసాను. కచ్చితంగా ఈ సారి సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను.

ప్రశ్న) మీ మార్క్ కామెడీ ఎంత ఉన్నా, కథలో అంతర్లీనంగా ఫ్యామిలీ సెంటిమెంట్, కుటుంబ విలువలకి పెద్ద పీట వేస్తుంటారు. ఎందుకలా.?

స) నా నుంచి ఆడియన్స్ ఆశించేది కామెడీ.. అందుకే కామెడీ ఉంటుంది. అది కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి నాకు ఇష్టం అందుకే నా ప్రతి సినిమాలో ఆ యాంగిల్ ఉండేలా చూసుకుంటాను. నాకు తెలిసి నా సినిమాల్లో ఫ్యామిలీ యాంగిల్ తక్కువ ఉన్న సినిమా అంటే ఆగడు. ఆ సినిమా ఫ్లాప్ కి అదీ ఒక కారణంగా భావిస్తాను.

ప్రశ్న) మీరు ఒకే తరహా కథలోనే సినిమాలు చేస్తున్నారు అనే ఒక ముద్ర ఉండిపోయింది. మరి బ్రూస్ లీ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందా.? లేక మార్పులేమైనా ఉన్నాయా.?

స) మామూలుగా ఆనందం టైంలో లవ్ – కామెడీ ఫార్మాట్ లో కొన్ని సినిమాలు చేశా, ఆ తర్వాత దానికి బ్రేక్ ఇచ్చి లవ్ – యాక్షన్ – కామెడీ బ్యాక్ డ్రాప్ లో వెంకీ, దుబాయ్ శీను, అందరివాడు లాంటి సినిమాలు చేసాను. ఆ తర్వాత డీ నుంచి ఓ ఫార్మాట్ స్టార్ చేసాను, సక్సెస్ అయ్యింది అలాగే నేను అదే ఫార్మాట్ లో ఎక్కువ సినిమాలు చేసేసాను, అదే టైంలో బయటి వారు కూడా అదే ఫార్మాట్ లో సినిమాలు చేయడం ఎక్కువైంది. అందుకే నేను ఆగడు సినిమా ఫ్లాప్ తర్వాత ఇక ఈ ఫార్మాట్ కి బ్రేక్ ఇచ్చేయాలని బ్రూస్ లీని సరికొత్తగా ట్రై చేసాను. బ్రూస్ లీ కొత్తగా ఉంటుంది, కానీ నా మార్క్ కామెడీ కూడా ఉంటుంది. ఇక అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చూసి చెప్పాలి.

ప్రశ్న) అసలు బ్రూస్ లీ – ది ఫైటర్ సినిమా కథ గురించి చెప్పండి.?

స) ‘బ్రూస్ లీ – ది ఫైటర్’ అనే టైటిల్ బాగా యాక్షన్ స్టైల్ లో ఉన్న ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ స్టొరీ. ఫ్యామిలీని విపరీతంగా ప్రేమించే వ్యక్తికి – సొసైటీలో ఓ పలుకుబడి ఉన్న వ్యక్తికి మధ్య ఓ పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు అన్నదే కథ.

ప్రశ్న) చిరంజీవి గారితో సినిమా చేసారు, ఇప్పుడు రామ్ చరణ్ తో చేసారు. చిరులోనూ చరణ్ లోనూ ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి.?

స) ఇక్కడ నా అనుభవం ఒకటి చెప్పాలి. నేను నా రెమ్యునరేషన్ కంటే డైరెక్టర్ గా నాకు ఫ్రీడం కోరుకుంటాను. సక్సెస్ లో ఉన్నవారికి ఆ ఫ్రీడం ఉంటుంది కానీ ఫ్లాప్ ఇచ్చిన నాకు చిరు, చరణ్ లు పూర్తి ఫ్రీడంని కలిగించారు. వారు ఆ ఫ్రీడం ఇవ్వడం వల్లే ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను. ఆ విషయంలో వారికి స్పెషల్ థాంక్స్ అండ్ హ్యాట్సాఫ్. ఇక చిరు – చరణ్ ల విషయానికి వస్తే.. చిరు గారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా బాలన్స్ గా ఉంటారు, ఎవ్వరినీ హార్ట్ చేయరు, అలాగే అందరినీ ప్రేమగా చూసుకుంటారు. ఆ క్వాలిటీస్ చరణ్ కి అలానే వచ్చాయి. వాటికంటే మించి చరణ్ తన వయసుకంటే మించి అనుభవం ఉన్న వ్యక్తిలా బిహేవ్ చేస్తాడు. అది నన్ను షాక్ చేసింది. బహుశా చిరు గారి పెంపకం వల్లనే ఆ క్వాలిటీ చరణ్ కి వచ్చిందనుకుంటా..

ప్రశ్న) రామ్ చరణ్ తో వర్క్ చేసిన అనుభవం ఎలా ఉంది, అలాగే రామ్ చరణ్ లో మీకు నచ్చిన అంశాలు ఏమిటి.?

స) రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. చరణ్ లో సూపర్బ్ సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. దానివల్లే నేను చరణ్ కి బాగా కనెక్ట్ అయ్యాను. చెప్పాలంటే చిరు గారిలోని కామెడీ టైమింగ్ చరణ్ లోనూ ఉంది. అది ఇప్పటివరకూ ఎవరూ చూపించలేదు, అదే నేను బ్రూస్ లీ లో చూసాను. ఇక చరణ్ లో నాకు బాగా నచ్చింది డాన్స్.. చాలా మంది బాగా డాన్సులు బాగా చేస్తారు కానీ నాకు చరణ్ డాన్సుల్లో ఉండే గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నాకు చరణ్ వాయిస్ మరియు హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ సినిమాలో చిరుత హెయిర్ స్టైల్ ని రిపీట్ చేసాను.

ప్రశ్న) డైరెక్టర్ గా మీకు ‘బ్రూస్ లీ’ సినిమాలో హైలైట్స్ అనిపించిన పాయింట్స్ ఏమిటి.?

స) మెయిన్ హైలైట్ ఏంటనేది మీకు తెలిసిందే.. అదే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఉండడం. ఇకపోతే కథ మరో హైలైట్, అలాగే ఎమోషనల్ ఎపిసోడ్స్,ఇంటర్వల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో చెయ్యడానికి మీరే ప్రధాన కారణమని విన్నాం.. దానిపై మీ కామెంట్.?

స)
ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం చిరు అయితే బాగుంటుందని అని అనుకుని ఆయన్ని అప్రోచ్ అయ్యాము. కథ మరియు ఆయన పాత్రకి ఉన్న ప్రాముఖ్యత చిరుకి బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకి నచ్చడం వల్లే ఒప్పుకున్నారు తప్ప ఫోర్స్ గా అయితే చేయలేదు.

ప్రశ్న) టోటల్ ఒక మూవీ ప్రాసెస్ లో మీకు బాగా టఫ్ అనే పీరియడ్ ఏంటి.? అలాగే ఈ సినిమాని కేవలం 4 నెలల్లో పూర్తి చేసారు ఆ విషయంలో ప్రెజర్ ఫీలయ్యారా.?

స) నాకు ఒక మూవీ ప్రాసెస్ మొత్తంలో టఫ్ అనిపించేది కథని రెడీ చేసుకోవడమే. ఎందుకంటే సినిమాకి అదే కీలకం. ఒకసారి అది ఒక అయ్యాక ఎంజాయ్ చేస్తూ సినిమా చేసేస్తాను. ఇక మీరన్నట్టు బ్రూస్ లీ సినిమాని నా కెరీర్లో చాలా తక్కువ టైంలోనే తీశాను. వెంకీ టైంలో ఇదే స్పీడ్ లో సినిమాలు చేశాను. ఆ తర్వాత అనుకోకుండా టైం తీసుకోవడం పెరిగింది. ఇంత ఫాస్ట్ గా సినిమా తీసినా ఎక్కడా ప్రెజర్ లేదు, బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాను. ఇంత ఫాస్ట్ గా చేయడంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకి స్పెషల్ థాంక్స్.

ప్రశ్న) చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాకి అరుణ్ విజయ్ లాంటి ఓ న్యూ విలన్ ని చూపించడం

స) చెప్పాలంటే ఈ సినిమాలో విలన్ ని చాలా లేట్ గా ఫైనలైజ్ చేసాం. రెగ్యులర్ విలన్స్ వద్దు కొత్తగా కావాలి అనుకుంటున్నాను. నార్త్ ఇండియన్ విలన్స్ అయితే సరిగా ఎక్స్ ప్రెషన్స్ పలకట్లేదు అని ఆలోచిస్తున్న టైంలో చరణ్ అరుణ్ విజయ్ పేరు చెప్పి ‘ఎన్నై అరింధాల్’ సినిమా చూడమన్నాడు. చూసాక తనైతేనే బాగుంటుందని అతన్ని అప్రోచ్ అయ్యాం. తనకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ఈ సారి నా నుంచి వచ్చే సినిమా పూర్తి రెఫ్రెషింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం రెండు లైన్స్ అనుకుంటున్నాను. త్వరలోనే ఒకటి ఫైనలైజ్ చేస్తాను. అలాగే ఈ సారి నేను చేయబోయే సినిమా డైరెక్టర్ గా నా స్థాయిని పెంచేది, నాకు ఉపయోగపడే సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాను. అలాగే ఇప్పటి వరకూ నెక్స్ట్ ఈ హీరోతో చెయ్యాలి అనే ప్లాన్ తో ఆ ఫార్మాట్లోనే కథ రాసుకునే వాళ్ళం. కానీ ఈ సారి ముందు కథని రాసుకుంటా, ఆ కథే హీరోని ఫిక్స్ చేస్తుందని అనుకుంటున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి శ్రీనువైట్లకి ఆల్ ది బెస్ట్ చెప్పాము.

రాఘవ

తాజా వార్తలు