యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా రోజు రోజుకీ అంచనాలను పెంచుకుంటూ దూసుకెళుతోంది. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇక ఆడియో కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న అభిమానులంతా రెట్టించిన ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు ఆడియో బయటకు వస్తుందా అని చూస్తున్నారు.
మొత్తం ఆరు పాటలున్న ఆడియోలో అన్ని పాటలనూ గీత రచయిత రామజోగయ్య శాస్త్రియే రాశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ ఆడియో గురించి తెలుపుతూ క్లాస్ నుంచి మాస్ వరకూ అన్ని రకాల పాటలూ ఈ ఆడియోలో ఉంటాయని, అందరికీ ఆడియో నచ్చుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో జనతా గ్యారెజ్ సినిమాతో పాటు ఆడియోపై కూడా అంచనాలన్నీ తారాస్థాయిలోనే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.


