జయలలితకు గుండెపోటు, ఆందోళనలో అభిమానులు!

jaya
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేసిన వారిలో ఒకరైన జయలలిత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలనుంచీ ఆమె ఆసుపత్రికే పరిమితం కాగా, తాజాగా ఆమె దాదాపుగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని కూడా వినిపించింది. కాగా నిన్న సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడం అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోంది. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో జయలలిత ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, ఇప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

దీంతో ఇప్పుడు తమిళనాడు అంతటా జయలలిత కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆమెను అమ్మ అని పిలుచుకునే అభిమానులంతా రాత్రంతా నిద్ర పోకుండా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. నేడు ఆసుపత్రి వర్గాల నుంచి మళ్ళీ ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సినీ పరిశ్రమలో స్టార్స్‌గా వెలుగొంది, రాజకీయాల్లోకి వచ్చి అక్కడా తిరుగులేని ఘనత వహించిన అతికొద్ది మందిలో జయలలితకు ఒక స్థానం ఉంది.