రాజమార్గంలోనే రాణిస్తానంటున్న జయశ్రీ రాచకొండ !

Published on Jan 28, 2020 10:00 am IST

గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. మన దర్శకులు మన సినిమా పతాకాన్ని ప్రపంచస్థాయిలో రెపరెప లాడిస్తూ.. తెలుగువాళ్లంతా రొమ్ములు విరుచుకునేలా చేస్తున్నారు. లక్షల రూపాయల వేతనాలను వదులుకుని మరీ ఎందరో విద్యాధికులు సినీ రంగ ప్రవేశం చేస్తూ.. ప్రతిభ వుండి ప్రణాళికాబద్ధంగా పరిశ్రమిస్తే.. సినిమానూ ఒక కెరీర్ గా మలచుకోవచ్చని, అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోనే ‘క్యారక్టర్ ఆర్టిస్ట్’గా తన ప్రత్యేకతను చాటుకుంనేందుకు, జయజయ ధ్వానాలు పలికించుకునేందుకు సమాయత్తమవుతున్నారు డైనమిక్ లేడీ లాయర్ ‘జయశ్రీ రాచకొండ’.

నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొంది అనూహ్య విజయం సాధించిన ‘అ!’తో నటిగా అరంగేట్రం చేసిన జయశ్రీ రాచకొండ.. ఆ సినిమాలో తన పాత్ర చాలా చిన్నదే అయినా.. ఇండస్ట్రీ సర్కిల్ లో చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. అయితే.. ‘ప్రతివాద భయంకర’గా అభివర్ణించేంత అసాధారణ వాదనా పటిమ కలిగి, లాయర్ గా చాలా బిజీగా ఉండే జయశ్రీ.. సినిమాల ఎంపికలో ఛాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. కాకపోతే.. సరైన సినిమా ఒక్కటి పడితే చాలు.. ఈ లాయరమ్మ తన న్యాయవాద వృత్తికి అతి త్వరలోనే అన్యాయం చేయడం, సినిమా పరిశ్రమకు అంకితం కావాల్సి రావడం ఖాయం. ఎందుకంటె ‘జయశ్రీ రాచకొండ’ అనే ఆమె పేరులో ఉన్న ‘రాజసం’ ఆమె రూపంలోనూ, నటనలోనూ పుష్కలంగా ఉండడం అందుకు కారణం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ఈ లాయర్ టర్నడ్ ఆర్టిస్ట్.. తన తల్లి తనకు రోల్ మోడల్ అని చెబుతారు. గ్రేట్ గ్రాండ్ మదర్ (ముత్తమ్మ) అయ్యాక, ముని మానవరాలితో ఆడుకుంటూనే.. ఎంతో పట్టుదలతో డిగ్రీ చేసి, తన పేరు పక్కన ‘బి.ఏ’ తగిలించుకున్న తన తల్లి నుంచి తానెంతో స్ఫూర్తిని పొందుతుంటానని జయశ్రీ అంటారు.

ఇక తన సోదరుడు ‘రాజ్ రాచకొండ’ తనకు అన్ని విధాలా, అన్ని వేళలా తన అండా దండా అందిస్తూ.. సపోర్ట్ సిస్టంగా నిలుస్తూ.. కొండంత ధీమా ఇస్తాడని చెప్పేటప్పుడు ఒకింత భావోద్వేగానికి లోనవుతారు రాచకొండ ఆడబిడ్డ శ్రీమతి జయశ్రీ. ‘రాజ్ రాచకొండ’మరెవరో కాదు.. ‘తెలంగాణ ప్రైడ్’ చింతకింది మల్లేశం బయోపిక్ గా రూపొంది.. ప్రేక్షకుల రివార్డులతోపాటు అవార్డులు దండిగా పొందిన ‘మల్లేశం’ చిత్ర దర్శక నిర్మాత. ప్రవాసంలో స్థిరపడిన ఈ తెలంగాణ ముద్దు బిడ్డ మరో మంచి చిత్రంతో మన ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్నట్లు తన సోదరుడు రాజ్ రాచకొండ దర్శక నిర్మాతగా రూపొందిన ‘మల్లేశం’లో డాక్టరమ్మగా మెరిశారు ఈ లాయరమ్మ. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆహ్లాదభరిత ప్రేమకథాచిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’లో హీరోయిన్ నేహా కృష్ణ మదర్ గా మంచి రోల్ చేస్తున్నానని, అలాగే పాయల్ రాజ్ పుత్ తో తెరకెక్కుతున్న ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలోనూ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాని.. ప్రముఖ దర్శకుడు నీలకంఠ శిష్యుడు ప్రణదీఫ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారని జయశ్రీ చెప్పారు. అలాగే జీ టీవీవారు జీ ఫైవ్ పేరిట నిర్మిస్తున్న ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్ లోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమై తొమ్మిది ఎపిసోడ్స్ గా ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ లో నటించడం తనకు మంచి అనుభూతిని పంచిందని చెబుతున్న జయశ్రీ.. ఇంకా పేరు పెట్టని మరో రెండు మూడు సినిమాల్లోనూ నటిస్తూ.. అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు.

‘నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను అంగీకరించి ఉంటె.. ఈపాటికే నేను నా లా ప్రాక్టీస్ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చేది. కానీ.. నేను నా వ్యక్తిత్వానికి, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించని, ‘సెట్ ప్రాపర్టీ’ అనిపించుకోని పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాను.. అంటారు జయశ్రీ. అయితే అదే సందర్భంలో.. అలా అని బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి తానేమీ వ్యతిరేకిని కానని క్లారిటీ ఇచ్చారు. అశ్లీలతకు, జుగుప్సకు తావులేని ఏ పాత్ర అయినా తాను చేస్తానని ప్రకటిస్తున్న ఈ బహుముఖ ప్రతిభాశాలి.. పలు ప్రకటనల్లోనూ నటించి మెప్పించి ఉండడం గమనార్హం. అదృష్టవశాత్తూ డబ్బుల కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని, చిన్న చిన్న పాత్రలు సైతం చేసేసి, వేరొకరి పొట్ట కొట్టడానికి ఇష్టపడనని, ఒక డిగ్నిఫైడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచుకోవాలన్నదే తన కోరికని చెబుతున్న ‘జయశ్రీ రాచకొండ’ చిరకాలంగా తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న క్యారక్టర్ ఆర్టిస్టులకు గల తీవ్ర కొరతను తీర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తారని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు!!

సంబంధిత సమాచారం :