జీవిత రాజశేఖర్ అతిధిగా `రాజ్ ధూత్` టీజ‌ర్ ఆవిష్కర‌ణ‌

Published on Jun 9, 2019 1:46 am IST

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘామ్ష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ ఎఫ్.ఎన్.సీ.సీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన జీవితారాజ‌శేఖ‌ర్ టీజ‌ర్ ఆవిష్క‌రించారు.

అనంత‌రం జీవిత మాట్లాడుతూ, `శ్రీహ‌రి-శాంతి కుమారులు చిన్న‌నాటి నుంచి తెలుసు. త‌ల్లి-తండ్రిలాగే మంచి వ్య‌క్తిత్వం గ‌ల‌వారు. నా ఇద్ద‌రు అమ్మాయిల‌తో పాటే బిడ్డ‌లాంటి వారు. మేఘామ్ష్ ,శివాత్మిక‌ వ‌య‌సు దాదాపు స‌మానం. ఇద్ద‌రు క్లాస్ మేట్స్. ఇప్పుడు మేఘామ్ష్ టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. సినిమా టీజ‌ర్, ర‌షెస్ చూసాను. మేఘామ్ష్ లో ఈజ్ ఉంది. శ్రీహ‌రి గారి క‌న్నా ప‌దిరెట్లు మంచి పేరు సంపాదిస్తాడ‌న్న‌ న‌మ్మ‌కం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ శ్రీహ‌రిగారు మ‌న మ‌ద్య‌లేరు అనే బాధ ఉండేది. ఇప్పుడా లోటును మేఘామ్ష్ తీర్చేసాడు. పెద్ద స్టార్ అవ్వాల‌ని కోరుకుంటున్నా” అన్నారు

శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ, `జీవిత నాకు బాల్య స్నేహితురాలు. నా బిడ్డ సినిమా టీజ‌ర్ త‌న చేతుల మీదుగా లాంచ్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో ఒకే ఒక్కసారి సెట్ కి వెళ్ళాను, మేఘామ్ష్ చాల బాగా చేస్తున్నాడనిపించింది. మా బావ శ్రీహరిని ఎలా తెలుగు ప్రేక్షకులు ఆదరించారో అలానే నా కొడుకుని ఆదరిస్తారని నమ్మకముంది అన్నారు. నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నా` అని అన్నారు.

హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ, `హీరోగా నాకిది తొలి చిత్రం. మా అమ్మ‌-నాన్నల వ‌ల్లే ఈరోజు ఈ స్థాయిలో నిల‌బ‌డ‌గ‌లిగాను. రాజ్ ధూత్ మంచి క‌థ‌. సుద‌ర్శ‌న్ -నాకు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్వు తెప్పిస్తాయి. ద‌ర్శ‌కులిద్ద‌రు చాలా క్లారిటీతో తెరెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. టెక్నిక‌ల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. మాట‌లు, పాట‌లు, సంగీతం అన్ని బాగా కుదిరాయి. ప్రేక్ష‌కులంతా ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎమ్.ఎల్.వి స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ, `శ్రీహ‌రి గారి అబ్బాయి ని హీరోగా ప‌రిచయం చేసే అవ‌కాశం నాకు రావ‌డం సంతోషంగా ఉంది. నామీద న‌మ్మ‌కంతో శాంతి గారి ఆ బాధ్య‌త‌ల్ని నాకు అప్ప‌గించారు. ఆమె న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను. క‌థ‌ని న‌మ్మి సినిమా చేసా. ద‌ర్శ‌కులిద్ద‌రు బాగా తెర‌కెక్కించారు. సినిమా స‌క్సెస్ పై ధీమాగా ఉన్నాం. ప్రేక్ష‌కులు శ్రీహ‌రి గారిని అభిమానించిన‌ట్లే మేఘామ్ష్ ను అభిమానించాల‌ని కోరుకుంటున్నా. సునీల్ గారు వాయిస్ ఓవ‌ర్ , జీవిత గారు ప్ర‌మోష‌న్ కు స‌హ‌క‌రించినంద‌కు ప్ర‌త్యేంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. మేఘామ్ష్ తో రెండ‌వ సినిమా కూడా నా బ్యాన‌ర్లోనే ఉంటుంది` అని అన్నారు.

సంతోషం అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, `పోస్ట‌ర్ చూడ‌గానే మేఘామ్ష్ ఇంప్రెసివ్ గా అనిపించాడు. పోస్ట‌ర్ లో హీరోయిక్ లుక్ చాలా బాగుంది. సునీల్ వాయిస్ ఓవ‌ర్ సినిమాకు బాగా క‌లిసొస్తుంది. రాజ్ దూత్ పెద్ద విజ‌యం సాధిస్తుంది. మేఘామ్ష్‌ టాలీవుడ్ లో పెద్ద హీరోగా ఎదుగుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రీహ‌రి గారి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. శాంతి గారిని అక్క అని పిలిచేంత చ‌నువుంది అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కులు అర్జున్-కార్తీక్ మాట్లాడుతూ, `ర‌చ‌యిత‌ల‌గా ప‌లు సినిమాల‌కు ప‌నిచేసాం. ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్ర‌మిది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన శాంతిగారికి, నిర్మాత‌ స‌త్యనారాయ‌ణ గారికి కృత‌జ్ఞ‌త‌లు. పోస్ట‌ర్, టీజ‌ర్ చూస్తేనే సినిమా స్టోరీ ఏంటి? అన్న‌ది అర్ధమైపోతుంది. హీరో రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ మీదున్నాడు…ఆ ప‌క్క‌నే రాజ్ దూత్ ఉంది. అదే ఈ సినిమా క‌థ‌. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.

హీరోయిన్ల‌లో ఒక‌రైన‌ న‌క్ష‌త్ర మాట్లాడుతూ, `తెలుగు అమ్మాయినే. హీరోయిన్ గా తొలి సినిమా ఇది. బ‌బ్లీ గాళ్ పాత్ర‌లో క‌నిపిస్తా. మేఘామ్ష్ మంచి కోస్టార్. వెరీ ట్యాలెంటెడ్. త‌నతో స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కులిద్ద‌రు మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.

ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు, ఆదిత్య మీన‌న్, దేశీ ప్ర‌సాద్, అనిష్ కురివెళ్ల‌, మ‌నోబాల‌, వేణుగోపాల్, దువ్వాసి మోహ‌న్, సూర్య ర‌వివ‌ర్మ‌, సుద‌ర్శ‌న్, చిత్రం శ్రీను, వేణు, ప్ర‌సాద్, సంతోష్ అడ్డూరి, భ‌ద్రం, ఎడిటింగ్: విజ‌య్ వ‌ర్ద‌న్.కె, నేప‌థ్య సంగీతం: జెబీ, సినిమాటోగ్ర‌పీ: విద్యాసాగ‌ర్ చింత‌, సంగీతం : వ‌రుణ్ సునీల్, కో డైరెక్ట‌ర్: శ‌రణ్ వేదుల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఎమ్.ఎస్ కుమార్.

సంబంధిత సమాచారం :

More