‘జై లవ కుశ’ ఆడియో ఈవెంట్ క్యాన్సిల్ !


ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ యొక్క ఆడియో వేడుకను సెప్టెంబర్ మొదటి లేదా రెండవ వారంలో రిలీజ్ చేయాలని ముందుగా చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని కూడా అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటం, సెప్టెంబర్ ఆరంభంలోనే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో ఎవ్వరికీ ఇబ్బంది కలుగకూడదనే ఉదేశ్యంతో వేడుకను రద్దు చేశారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. అంతేగాక ఆడియో ఆల్బమ్ 3వ తేదీ నుండి మార్కెట్లోకి విడుదలవుతుందని, పాటల కార్యక్రమం లేనందుకు అందుకు బదులుగా అభిమానుల కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో వేడుక నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.