యూఎస్‌లో మరో రికార్డు కొట్టిన ‘కబాలి’!

27th, July 2016 - 11:48:08 PM

kabali1
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చినా, సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులంతా, ఎలా ఉన్నా సినిమా చూసేయాలని అనుకుంటూ ఉండడంతో కలెక్షన్స్ ఇప్పటికీ స్టడీగానే కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు నుంచే తిరుగులేని కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 4 మిలియన్ డాలర్లు (ఒక్క తమిళ వర్షన్‌లోనే) వసూలు చేసింది. తెలుగు వర్షన్ కూడా కలుపుకుంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువే. సౌతిండియన్ సినిమాల్లో రాజమౌళి సృష్టించిన ప్రభంజనమైన ‘బాహుబలి’ తర్వాత ‘కబాలి’ రెండో స్థానం సొంతం చేసుకుంది. కేవలం తమిళ సినిమాల వరకు మాత్రమే చూస్తే, కబాలి టాప్ ప్లేస్‌లో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ కలెక్షన్స్ రజనీ స్థాయి ఏంటన్నది మరొకసారి ఋజువుచేశాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కళైపులి థాని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.