ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది. కమల్ స్వయంగా తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజేష్ ఎం సెల్వ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళంలో తూగవనం పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళి కానూకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి పెద్ద ఎత్తున విడుదల చేయాలని కమల్ భావిస్తున్నారు. చీకటి రాజ్యం సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్‌కు ఊహించని రీతిలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా దీపావళికి రానున్న సినిమాల్లో ఓ క్రేజీ ప్రాజెక్టూగా కనబడుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన త్రిష పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. చీకటి రాజ్యంలో త్రిష ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌కు, తనకూ మధ్యన ఒక ఆసక్తికర ఎపొసోడ్ ఉంటుందని, తన కెరీర్లో ఇలాంటి ఎపిసోడ్‌ను ఎప్పుడూ చేయలేదని త్రిష చెప్పుకొచ్చారు. చాలా వినూత్నంగా ఉండే ఈ ఎపిసోడ్‌ను ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచుతున్నామని, రిలీజ్ తర్వాతే ఆ సర్ప్రైజ్ ఏంటనేది తెలుస్తుందని త్రిష స్పష్టం చేశారు. ఇప్పటికే క్రేజీగా కనిపిస్తోన్న సినిమాలో ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే!


