
ప్రయోగాలకు పెట్టింది పేరైన నటుడు కమల్ హాసన్ తాజాగా చేస్తోన్న మరో ప్రయోగమే ‘చీకటి రాజ్యం’. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా తాజాగా ఈ సాయంత్రం తమిళ వర్షన్ ‘తూంగవనం’ సెన్సార్ కూడా పూర్తైంది. కమల్ స్వయంగా తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజేష్ ఎం సెల్వ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సెన్సార్ సభ్యులు తూంగవనం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కేవలం రెండు గంటల 7 నిమిషాల నిడివి గల ఈ సినిమా సూపర్ ఫాస్ట్ స్క్రీన్‌ప్లేతో మెప్పించనుంది.
ఇక తెలుగు వర్షన్ చీకటి రాజ్యంకు సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తికాగా త్వరలోనే తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేయనున్నారు. పోస్టర్స్, ట్రైలర్‌తో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. కమల్ హాసన్‌తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఒకేసారి రెండు భాషల్లోనూ పెద్ద ఎత్తున విడుదల కానుంది. చీకటి రాజ్యం సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని కమల్ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు.

