
నటనలో దేశవ్యాప్తంగా తనదైన మార్క్, బ్రాండ్‌ను చాటి చెప్పిన అతికొద్ది మంది నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఎప్పుడూ ఏదో ప్రయోగంతో మనముందుకు వచ్చే కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటించే సినిమాలన్నీ రెండు భాషల్లోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా కమల్ హీరోగా నటిస్తోన్న చీకటి రాజ్యం కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందింది. నవంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇక ఓ పక్క కమల్ ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే మరోపక్క మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. కమల్ సన్నిహితులు చెప్తున్న వివరాల ప్రకారం కమల్ హాసన్ వద్ద ఇప్పటికిప్పుడు 8 స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్ళకలిగేలా కమల్ సిద్ధం చేశారట. ఇక ఏడాదికి ఐదు సినిమాలు చేసేందుకు కమల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ సిద్ధంగా ఉండడంతో ఇక వాటిని సెట్స్‌పైకి తీసుకుపోవడమే ఆలస్యమని కమల్ భావిస్తున్నారు. మరి కమల్ టార్గెట్ అయిన ఏడాదికి ఐదు సినిమాలు వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

