కమల్‌‌కు అండగా తమిళ నిర్మాతలు!

కమల్‌‌కు అండగా తమిళ నిర్మాతలు!

Published on Apr 14, 2015 11:00 AM IST

kamal-hassan
‘ఉత్తమ విలన్’ సినిమాకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురౌతున్నాయి. విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచే నటుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. తమిళ, తెలుగు భాషల్లో మే 1న ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా వివాదాల నేపథ్యంలో సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలోని ఓ పాట హిందువుల మనోభావాలను కించపరచే విధంగా రూపొందిందని, ఈ సినిమాను నిలిపివేయాలని వీహెచ్‌పీ చెన్నైలో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌కు కొన్ని ముస్లిం సంస్థలు సైతం మద్దతు తెలపడం విశేషంగా కనిపిస్తోంది. కమల్ సినిమా ఈ రకంగా ఇబ్బందులకు గురౌతున్న నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమలోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై ‘ఉత్తమ విలన్’ సినిమాకు తమ పూర్తి మద్దతు తెలపాలని నిర్ణయించారు. సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో సి. కళ్యాణ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు.

తాజా వార్తలు