
ఒక కాంబినేషన్ లో హిట్ సినిమా, మళ్ళీ అదే కాంబినేషన్ లో ఇంకొంతమంది స్టార్స్ యాడ్ అయ్యి దానికి సీక్వెల్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటి అంచనాల నడుమ 2009లో వచ్చిన ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా ‘కిక్ 2’. సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న మాస్ మహారాజ్ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ గత శుక్రవారం విడుదలై డీసెంట్ హిట్ ని సొంతం చేసుకుంది. భారీ క్రేజ్ తో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ఇదివరకే తెలియజేశాం.
మొదటి రోజు అన్ని ఏరియాలను కలుపుకొని సుమారు 7 కోట్లపైన షేర్ సాధించిన కిక్ 2 సినిమా రెండవ రోజు కూడా అదే జోరుని కొనసాగించింది. రెండవ రోజు కూడా సుమారు 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లో సుమారు 12 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. రవితేజ కెరీర్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం. ‘కిక్’ సినిమా పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా కావడం వలన ఈ సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తున్నాయని సమాచారం.
రవితేజకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. బ్రహ్మానందం, రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రా లాంటి కమెడియన్స్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.